హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించింది. యథాతథ స్థితిని కొనసాగించవచ్చని స్పష్టంచేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించిన జీవో-16పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం కేసును విచారించిన సుప్రీంకోర్టు స్టేటస్ కోను జారీచేసినట్టు అధ్యాపక సంఘాల నేతలు శ్రీనివాస్, సురేశ్ వెల్లడించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని, లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పోరుబాట పట్టనున్నట్టు సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం(సీపీఎస్‌టీఈఏ టీఎస్) హెచ్చరించింది. మాయమాటలు చెప్పి పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తామంటూ హామీలిస్తూ కాంగ్రెస్ సర్కారు పబ్బంగడుపుతోందని సంఘం అధ్యక్షుడు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలని వారు సూచించారు.