న్యూఢిల్లీ: లోకల్ రిజర్వేషన్ల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. రాష్ట్రంలో 9 నుంచి 12వ తరగతి వరుసగా నాలుగేండ్లు చదివితేనే లోకల్ అని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేండ్ల స్థానికత తప్పనిసరి అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా వరుసగా నాలుగేండ్లు చదివితేనే స్థానికత రిజర్వేషన్ వర్తిస్తుందన్న తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్-33ని సమర్థించింది. గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవాల్సిందేనన్న నిబంధనను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.