న్యూఢిల్లీ : ముస్లింలలో విడాకుల అంశాన్ని సుప్రీంకోర్టు మరోమారు పరిశీలిస్తున్నది. ‘తలాక్-ఎ-హసన్’ అనే ట్రిపుల్ తలాక్ పద్ధతి చట్టబద్ధతను సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ప్రశ్నించింది. ఈ పద్ధతి ప్రకారం ఒక ముస్లిం పురుషుడు వరుసగా మూడు నెలలపాటు నెలకు ఒకసారి తలాక్ అని చెప్పి తన భార్యకు విడాకులు ఇవ్వొచ్చు. ముస్లింలలో ట్రిపుల్ తలాక్ (తలాక్-ఎ-బిద్దత్)ను ఎనిమిదేండ్ల క్రితం సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే ట్రిపుల్ తలాక్లో మరో రూపమైన ‘తలాక్-ఎ-హసన్’ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు బుధవారం విచారించింది.
‘ఆధునిక సమాజంలో దీనిని ఎలా అనుమతిస్తున్నారు?’ అని ధర్మాసనం ఘాటుగా ప్రశ్నించింది. విడాకుల ప్రక్రియలో మాజీ భర్త సంతకం చేయకపోవడంతో తన బిడ్డ స్కూల్ అడ్మిషన్ కోసం ఒక ముస్లిం మహిళ ఇబ్బందులు పడుతున్న కేసును కూడా కోర్టు ప్రస్తావించింది. మతపరమైన ఆచారం ప్రకారం తలాక్ జరగాలంటే నిర్దేశించిన ప్రక్రియ మొత్తాన్ని తప్పనిసరిగా అనుసరించాలని పేర్కొంటూ, తన హక్కుల కోసం పోరాడుతున్న ఆ మహిళను అభినందించింది.