పాట్నా: జేడీయూ అధినేత నితీశ్ కుమార్ గురువారం బీహార్ ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణం చేసి రికార్డు సృష్టించనున్నారు. ఎన్డీఏ నాయకుడిగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎమ్మెల్యేలు బుధవారం నాడిక్కడ సమావేశమై తమ నాయకుడిగా నితీశ్‌ని ఎన్నుకున్నట్లు రాష్ట్ర మంత్రి శ్రావణ్ కుమార్ తెలిపారు.
పాట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో గురువారం ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ ప్రమాణం చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఎన్డీఏ నాయకుడిగా ఎన్నికైన అనంతరం ఇతర నాయకులతో కలసి రాజ్‌భవన్‌కు వెళ్లిన నితీశ్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు ముఖ్యమంత్రి పదవికి తన రాజీనామా లేఖను సమర్పించారు. నితీశ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.