న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: సభ్యులపై చట్టసభలు తీసుకున్న చర్యలను పరిశీలించే విషయంలో న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ఒక్కో కేసును న్యాయస్థానం నిశితంగా పరిశీలించి సభ్యుడి ప్రవర్తన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తన విచక్షణను ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం సూచించింది. బీహార్ శాసనమండలిలో ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ ఉదంతం విషయంలో కొన్ని మార్గదర్శకాలను విధిస్తూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సభ్యుడు నినాదాలు చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.
అయితే మండలి నుంచి సభ్యుడిని బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అత్యంత కఠినమైనదిగా, మితిమీరినదిగా అభివర్ణిస్తూ ఈ నిర్ణయాన్ని ధర్మాసనం పక్కనపెట్టింది. సభ్యుడిపై తీసుకున్న చర్య తీవ్రతను పరిశీలించడానికి ముందు సభలో సభ్యుడి ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టులకు ధర్మాసనం సూచించింది. సభ్యులు వ్యక్తీకరించే నాటు హావభావాలు ఉద్దేశపూర్వకంగా చేసినవా లేక స్థానిక యాసభాషల ప్రభావంతో కూడినవా అన్న విషయాలను కూడా కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. సభలో అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారన్న ఆరోపణపై 2024 జులై 26న సునీల్ కుమార్ సింగ్ బీహార్ శాసన మండలి నుంచి బహిష్కరణకు గురయ్యారు. సభలో వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలో సీఎంకు వ్యతిరేకంగా సునీల్ నినాదాలు చేశారు.