గంగాధర : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దుయ్యబట్టారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకంపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకే ధాన్యం కొనుగోలు చేస్తామని పగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ పాలకులు క్షేత్రస్థాయిలో ఆచరించడం లేదని పేర్కొన్నారు.
కేంద్రాల్లో రైతులను పట్టించుకునే నాథుడే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి కేసీఆర్ పాలనలో రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ అయ్యేలా చూసామని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తరుగు పేరుతో అదనంగా ధాన్యం తూకం వేయకుండా కొనుగోలు చేసి, మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, నాయకులు ఆకుల మధుసూదన్, కంకణాల విజేందర్ రెడ్డి, వేముల దామోదర్, రామిరెడ్డి సురేందర్, ముక్కెర మల్లేశం, శ్రీమల్ల మేఘరాజు, కర్ర శ్రీనివాస్ రెడ్డి, సామంతుల శ్రీనివాస్, దోమకొండ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.