హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 29 : వరంగల్ ఆర్ఈసి/ఎన్ఐటి(NIT) వ్యవస్థాపకుడు, దివంగత వరంగల్ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇటకాల మధుసూదన్‌రావు(Madhusudan Rao) కాంస్య విగ్రహాన్ని వెంటనే ప్రతిష్టించాలని ఎన్ఐటీ నాన్‌టీచింగ్ అసోసియేషన్ నాయకుడు సుంకరి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. మధుసుదన్‌రావు వర్ధంతి సందర్భంగా ఎన్ఐటీ ఎదుట ఆయన చిత్రపటానికి ఎన్ఐటి మాజీ డీన్ ప్రొఫెసర్ పి.రవికుమార్, వేణుగోపాల్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఈసి స్థాపన కోసం అహర్నిశలు కృషిచేసిన ఇటకాల మదుసుధన్ రావు సేవలను గుర్తించి ఎన్ఐటి మెయిన్ గేటు ముందు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అందుకు ఎన్ఐటీలో పనిచేస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలి స్వాతంత్ర సమరయోధుడు వరంగల్ జిల్లా నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచి ఆర్ఈసిని తిరుపతికి వెళ్లకుండా వరంగల్‌కు తీసుకొచ్చిన తొలి తెలంగాణవాది మధుసూదన్‌రావు అని వారి సేవలు ఇప్పటికైనా గుర్తించాలని పిలుపునిచ్చారు.
ఎన్ఐటి ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకుడు మైదం సంజీవ మాట్లాడుతూ 60 సంవత్సరాల క్రితమే వరంగల్ అభివృద్ధికి పునాదులు వేశారని, వరంగల్‌లో కేఎంసీ, ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఎంజీఎం, పాలిటెక్నిక్ కాలేజీ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన సేవలను గుర్తించకపోవడం విచారకరమని, ఇప్పటికైనా వరంగల్‌లో ఉన్న ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఎంపీలు చొరవ తీసుకొని ఎన్ఐటి గేటు ముందు మధుసూదన్‌రావు విగ్రహం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నిట్ నాయకులు వై.రామచందర్, బొట్టు శీను, బి.యాకుబ్, మునగాల రవి, కొలిపాక కరుణాకరు, మడూరు మల్లేశం, సింగారపు రవి, తాళ్ల పోశయ్య, ప్రేమ్‌కుమార్ ప్రమోదు, ఏ.కొమురయ్య, బి.జయంతు, తార, శారద, లక్ష్మి, తాళ్ల రాణి, బాబు పాల్గొన్నారు.