మెదక్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ, తరుగు పేరుతో రెండు కిలోలకు పైగా అదనంగా తీసుకుంటున్నారని, దీన్ని వెంటనే నిలిపియాలని ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వం లారీల సమస్య, హమాలీల సమస్యను వెంటనే పరిష్కరించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.
అలాగే శివంపేట మండలం చిన్న గొట్టిముక్కల చౌరస్తా వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేశారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రైతులను బుజ్జిగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.