తక్కువ కాలంలో పంట చేతికి
అధికారుల సూచనలతో అధిక దిగుబడులు
పెరిగిన ఆరుతడి పంటల విస్తీర్ణం
నిజాంపేట, డిసెంబర్ 27 : మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడంతో అన్నదాతలు ఆర్థికాభివృద్ధి చెందవచ్చు. వ్యవసాయశాఖ అధికారులు ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ నీళ్లు, పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. పొద్దుతిరుగుడు పంటను నిజాంపేట మండలంలో ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్నారు. మండలంలోని నిజాంపేటతోపాటు తిప్పనగుల్ల, కల్వకుంట, నందిగామ, చల్మెడ, నస్కల్, రాంపూర్, వెంకటాపూర్(కె), నార్లపూర్, నగరం గ్రామాల్లో రైతులు ఆరుతడి పంటగా పొద్దుతిరుగుడు సాగు చేసి లాభాలు సాధిస్తున్నారు. నిజాంపేట మండల వ్యాప్తంగా 175 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటను రైతులు సాగు చేస్తున్నారు.
పొద్దుతిరుగుడు పంటకు తక్కువ నీళ్లు..
పొద్దుతిరుగుడు పంట సాగు చేయడానికి తక్కువ నీరు అవసరం ఉంటుంది. దాదాపు 15 రోజులకు ఒక్కసారి పం టకు నీటి తడిని అందిస్తే సరిపోతుంది. ఒక ఎకరానికి 8 నుంచి 11 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తున్నది. పశువులు, పక్షుల నుంచి పం టను రక్షించుకునేదుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంటకు ఏదైనా వ్యాధులు సంక్రమిస్తే వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోకుండా వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.
తక్కువ సమయంలో పంట చేతికి వస్తుంది..
నా రెండెకరాల పొలంలో పొద్దుతిరుగుడు పంట సాగు చేస్తున్నా. తక్కువ నీళ్లతో పండే పంట కాబట్టి సులువుగా సాగు చేయొచ్చు. ప్రస్తుతం పంట మొత్తం పూత దశలో ఉంది. పిట్టలు రాకుండా అక్కడక్కడా దిష్టిబొమ్మలు ఏర్పాటు చేశా. వ్యవసాయ అధికారులు సూచించిన మందులు వాడాను. వచ్చే సారి కూడా ఇదే పంటను సాగు చేస్తా. – బెల్లం పెంటయ్య, రైతు, తిప్పనగుల్ల
ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది..
ఆరుతడి పంటలు సాగు చేయాలని నిజాంపేట మండల వ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు సాగు చేస్తున్న పంటల్లో మార్పు మొదలైంది. వరి పంటకు బదులుగా ఇతర పంటలైన వేరుశనగ, శనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, సజ్జలు, రాగులు వంటి పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. – సతీశ్, మండల వ్యవసాయ అధికారి