చెరుకును నరికిన తర్వాత చేనులో పోగైన చెత్తను రైతులు కాల్చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆ చెత్తలో ఉండే నత్రజని, భాస్వరం, పొటాష్లాంటి పోషకాలతోపాటు భూసారాన్ని కూడా నష్టపోతున్నారు. పర్యావరణ కాలుష్యానికీ కారణమవుతున్నారు. ఈ చెరుకు చెత్తతోనే సాగుకు ఉపయోగపడే ఎరువును తయారు చేసుకోవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
చెరుకు చెత్తలో నార పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీన్ని శిలీంధ్రంతో కలిపి కుళ్లబెడితే సేంద్రియ ఎరువు తయారవుతుంది. అది పైరుకు పోషకాల్ని అందిస్తుంది. చేనుకు చేవ తీసుకొస్తుంది. నీటి వినియోగాన్నీ తగ్గిస్తుంది.
కుళ్లబెడితేనే..
చెరుకు చెత్తను కుళ్లబెట్టి ఎరువుగా మార్చవచ్చు. రెండున్నర ఎకరాల తోటకు మూడు కిలోల శిలీంధ్రం అవసరం అవుతుంది. బాగా చివికిన పశువుల ఎరువు లేదా ఫిల్టరు మడ్డికి ఈ శిలీంధ్రాన్ని కలుపుకోవాలి. దానిపై పల్చగా నీరు చల్లి, నీడలో ఉంచాలి. దానిపై గోనె సంచి లేదా వరి గడ్డి కప్పాలి. వారం రోజుల్లో శిలీంధ్రం వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత దానిని సాళ్ల మధ్య పరిచిన చెరుకు చెత్తపై పలుచగా చల్లుకోవాలి. ఈ సమయంలో కొద్దిపాటి తేమ ఉంచాలి.
చేనుకు చేవ..
ఈ శిలీంధ్ర సముదాయాన్ని చెరుకు తోటల్లో వాడుకోవచ్చు. మొక్క తోటల్లోనైతే.. ముచ్చెలు నాటిన మూడో రోజున చెరుకు చెత్తను పొలంలో పలుచగా పరవాలి. ఇందుకోసం ఎకరానికి 1.25 టన్నుల చెరుకు చెత్త అవసరం అవుతుంది. కాలువలు ఎగదోసేటప్పుడు 1.25 కిలోల శిలీంధ్రం, 8 కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను కలిపి చెరుకు చెత్తపై చల్లి, మట్టితో కప్పేయాలి. కొన్ని రోజులకు ఆ చెత్త మిశ్రమం సేంద్రియ ఎరువుగా తయారవుతుంది.
పిలక పంటలోనైతే.. తోటలు నరికిన తర్వాత ఎకరానికి 1.25 టన్నుల చొప్పున చెరుకు చెత్తను సాళ్లలో వేయాలి. దానిపై ఎకరానికి 10 కిలోల చొప్పున సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా, 1.25 కిలోల శిలీంధ్రం కలిపి చేనంతా కలిసేలా చల్లుకోవాలి. కార్శి మోళ్లకు ఆనుకొని నాగలితో లోతుగా దున్నితే, మొదళ్ల వద్ద ఉన్న పాత వేర్లు తెగి కొత్త వేర్లు పుట్టుకొస్తాయి. అప్పుడు కొత్తగా వచ్చే పిలకలు బాగా మొలుస్తాయి. నేలలో వేసిన చెరుకు చెత్త కుళ్లి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది.
నేరుగా.. ఎరువుగా!
చెరుకు చెత్తను నేరుగా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం మీటరు లోతు, రెండు మీటర్ల వెడల్పు, ఆరు మీటర్ల పొడవుతో ఒక గొయ్యి తీయాలి. అందులో 15 సెంటీమీటర్ల మందంలో చెరుకు చెత్త పరుచుకోవాలి. చెత్తను తేమగా ఉంచేందుకు నీళ్లను చిలకరించాలి. దానిపైన పేడ నీటిని చల్లుకొని, కిలో శిలీంధ్ర సముదాయం, 8 కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్పేట్ను చల్లుకోవాలి. ఆ తర్వాత ఒకటి, రెండు సెంటీమీటర్ల మందంతో మట్టిని కప్పాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు నెలలపాటు అలాగే వదిలేస్తే, చెరుకు చెత్త కుళ్లిపోయి కంపోస్ట్‌గా మారుతుంది. దానిని నేరుగా పొలంలో వేసుకోవచ్చు. ఇలా పొరలు పొరలుగా చెరుకు చెత్తను గోతిలో వేస్తూ, కంపోస్ట్ ఎరువును తయారు
చేసుకోవచ్చు.