Suchir Balaji | న్యూఢిల్లీ, జనవరి 17: ఇటీవల అమెరికాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన భారత సంతతికి చెందిన విజిల్‌బ్లోయర్, ఓపెన్ ఏఐ పరిశోధకుడు సుచిర్ బాలాజీ తల్లి పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు చేశారు. సామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ కంపెనీయే తన కుమారుడి మరణానికి కారణమని ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా తన కుమారుడి వద్ద కొన్ని పత్రాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి అయిన 26 ఏండ్ల సుచిర్ బాలాజీ గత ఏడాది నవంబర్‌లో శాన్ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఓపెన్ ఏఐతో విభేదించి అందులోంచి బయటకు వచ్చిన సుచిర్ తర్వాత దాని అవకతవకలను, లోపాలను, అది అనుసరిస్తున్న అనైతిక విధానాలను ప్రశ్నిస్తూ విజిల్ బ్లోయర్‌గా మారాడు. అమెరికన్ కామెంటేటర్ టక్కర్ కార్ల్‌సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమారుడిది ఆత్మహత్య కాదని, హత్యని పూర్ణిమ రావు మరోసారి ఆరోపించారు. దీనిపై ఎఫ్‌బీఐ విచారణ జరపాలని తమ కుటుంబం కోరుకుంటున్నదన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సుచిర్‌ది ఆత్మహత్యని 14 నిమిషాల్లోనే ప్రకటించారని, కానీ వారి కేసు దర్యాప్తులో అనేక లోపాలు ఉన్నాయని, వాస్తవానికి అది ఆత్మహత్య కాదు హత్య అని ఆమె తెలిపారు.
స్పందించిన ఎలాన్ మస్క్
సుచిర్ బాలాజీ మరణంపై ఆమె తల్లి చేసిన ఆరోపణలపై బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఓపెన్ ఏఐ లాభదాయక సంస్థగా మార్పు చెందడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన సుచిర్‌ది ఆత్మహత్యలా అన్పించడం లేదని పేర్కొన్నారు. ఆమె ఇంటర్వ్యూను పోస్ట్ చేస్తూ ‘చాలా ఆందోళనకరం’ అని వ్యాఖ్యానించారు. ‘ సుచిర్ బాలాజీది ఆత్మహత్య కాదని ఆమె తల్లి భావిస్తున్నారు. అందుకే ఆమె ఎఫ్‌బీఐ దర్యాప్తు కోరుతున్నారు’ అని పేర్కొన్నారు.