‘ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే విజయం దాసోహమవుతుంది.. ఎన్ని గంటలు చదివామనేది కాదు, సబ్జెక్ట్‌ను ఎంత బాగా అవగాహన చేసుకున్నామన్నదే ముఖ్యం. ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకూ గురికావద్దు. ప్రశాంతంగా చదువుమీదే దృష్టి పెట్టాలి. నోటిఫికేషన్‌లోని ఖాళీల్లో ఒక పోస్టు మీకే అన్న దృక్పథంతో ముందుకు సాగితే జాబ్ కొట్టినట్టే’నని చౌటుప్పల్ ఏసీపీ నూకల ఉదయ్‌రెడ్డి తెలిపారు. ఈయన మొదటి ప్రయత్నంలో గ్రూప్1లో స్టేట్ 5వ ర్యాంకు సాధించారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చే అవకాశమున్నా, ఇష్టంగా పోలీస్ శాఖలో డీఎస్పీగా జాయిన్ అయినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగ భర్తీకి సిద్ధమవుతున్న తరుణంలో నమస్తే తెలంగాణ చేసిన ఇంటర్వ్యూలో ఉద్యోగార్థులకు విలువైన సూచనలు ఇచ్చారు. గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఖాళీ సమయంలో సలహాలు, సూచనలు అందించేందుకూ సిద్ధమని తెలిపారు.
చౌటుప్పల్ ఏసీపీగా పనిచేస్తున్న నూకల ఉదయ్‌రెడ్డి తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 ఉద్యోగం సాధించారు. డిప్యూటీ కలెక్టర్ అవకాశాన్ని వద్దనుకుని తనకు ఇష్టమైన పోలీస్‌శాఖను ఎంచుకున్నారు. డీఎస్పీగా పని చేసి శాంతిభద్రతలు, పలు సామాజిక సేవా కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు సిద్ధంగా ఉన్న తరుణంలో తన సక్సెస్‌కు సంబంధించిన విషయాలను ’నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. గ్రూప్ 1 పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి శిక్షణ ఇవ్వడానికి
ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
గ్రూప్-1 అనగానే కంగారు పడాల్సిన పనిలేదు. ప్రిపరేషన్ ను ప్రణాళికా బద్ధంగా కొనసాగిస్తే గ్రూప్-1 ఉద్యోగం మిమ్మల్ని వరిస్తుంది. ప్రణాళిక ప్రకారం రోజుకు కనీసం 14 గంటల పాటు చదువాలి. కనీసం రెండు గంటల పాటు తెలుగు, ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు తిరగేయాలి. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది.. ఆన్లైన్లో మంచి మెటీరియల్ అందుబాటులో ఉంది. ఒకవైపు బేసిక్స్‌పై దృష్టి సారిస్తూనే అందుబాటులో ఉన్న బుక్స్‌ను శ్రద్ధగా చదివి అర్థం చేసుకోవాలి. చదువుతున్నప్పుడే మనదైన శైలిలో ప్రత్యేకమైన నోట్స్‌ను తయారు చేసుకోవాలి అని సూచించారు.
ఉద్యోగాలు సాధించేందుకు రూ. లక్షలు వెచ్చించి కోచింగ్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం పెద్దగా ఉండదు. మార్కెట్లో ఎన్నో చక్కని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, వాటిని చదువుతూనే గతంలో జాబ్స్ సాధించిన సీనియర్ల ఒపీనియన్ తీసుకోవాలి. పోస్టుల్లో ఒక పోస్టు నాదే అనే భావనతో ప్రిపరేషన్ కొనసాగించాలి. డైరెక్ట్ట్గా ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్, మెయిన్స్ చేయడం చాలా తేలికవుతుంది. మన ఆటిట్యూడ్ మన భవిష్యత్‌ను నిర్ధారిస్తుందని గ్రహించాలి.
గ్రూప్ -1 ప్రిపరేషన్ చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ప్రిపరేషన్ సమయంలో అనేక విషయాల్లో కొంత ఒత్తిడికి లోను కావాల్సి వస్తుంది. రోజూ ఒక గంట క్రీడలు ఆడడం, ఫ్యామిలీతో గడపడం, చిన్నపాటి వ్యాయామాలు చేయడం, వాకింగ్ లాంటి కార్యక్రమాలు చేయాలి. ప్రిపరేషన్ ను ఒక పద్ధతిలో కొనసాగించాలి. ఆరంభ శూరత్వంలా.. కొన్ని రోజులు 20గంటల పాటు చదివి.. మధ్యలో వదిలేయొద్దు. ఒక మారథాన్లాగా ప్రిపరేషన్ కొనసాగిస్తేనే విజయం సాధిస్తాం.
గ్రూప్-1 లాంటి పెద్ద పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎంతో ఒత్తిడిలో ఉంటారు. జాబ్ వస్తుందా.. రాదా? రాకపోతే భవితవ్యం ఏమిటో అన్న మీమాంసలో ఉంటారు. వారికి కుటుంబ సభ్యులు వెన్నుదన్నుగా ఉండాలి. ఎప్పటికప్పుడు వారిని మోటివేట్ చేస్తూ ప్రిపేర్ అయ్యేలా చూడాలి. వారికి కావాల్సినవి సమకూరిస్తే ప్రిపరేషన్ మరింత తేలికవుతుంది.
పోలీస్‌శాఖలో గ్రూప్-1 పోస్టులకు ప్రిపేర్ అవుతున్న వారికి ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నేనే ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాను. వీరితో పాటు మిగతా అభ్యర్థులకు కూడా తగిన సలహాలు , సూచనలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
కొంతమంది ఎంతో చక్కగా ప్రిపరేషన్ కొనసాగిస్తారు. సబ్జెక్ట్‌పై కూడా పూర్తి పట్టు సాధిస్తారు. కానీ పరీక్షా కేంద్రాల్లో ఒత్తిడికి లోనై సరిగ్గా అటెమ్ట్ చేయరు. ఈ విధానాన్ని విడనాడాలి. తరుచూ గతంలోని ప్రశ్నపత్రాలకు సమాధానాలు రాసి కరెక్షన్ చేయించుకోవాలి. ఎగ్జామ్ ఫోబియో వీడితేనే అనుకున్న ఫలితం వస్తుంది.