కొల్లాపూర్ : పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలలో (Gurukul School) ఫుడ్ పాయిజన్ ( Food poison) జరిగింది. కొద్ది రోజులుగా ఉడికి ఉడకని అన్నం తో పాటు పురుగులన్నం పెడుతుండడంతో దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు( Students Ill) గురయ్యారు.
విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందించకుండా తల్లిదండ్రులను పిలిపించి అస్వస్థతకు గురైన పిల్లలను ఇళ్లకు పంపించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని బయటికి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అస్వస్థతకు గురైన కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విషయాన్ని బయటకు చెప్పడంతో ఆదివారం గురుకుల పాఠశాల వద్ద గందరగోళం నెలకొన్నది. కల్తీ ఆహారం పెట్టడంతోపాటు సీజనల్ వ్యాధులు వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
మెనూ ప్రకారం భోజనాలు పెట్టకుండా బియ్యంలో పురుగులు ఉన్న అలాగే వండి పెడుతున్నారని విద్యార్థుల ఆరోపించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మండలంలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రానికి కూడా తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రభుత్వ గురుకులాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని సీపీఎం మండల కార్యదర్శి దశరథం ఆరోపించారు. గురుకుల పాఠశాలలపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. పెద్దకొత్తపల్లి గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ పై విచారణ జరిపి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.