– ఎంజీయూ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు వచ్చిన విద్యార్థుల పాట్లు
– అధికారుల అనాలోచిత వైఖరితో అన్నెపర్తి టూ పానగల్
రామగిరి, జూలై 31 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అధికారుల తీరుతో వర్సిటీలో బీటెక్‌లో సీట్లు పొందిన విద్యార్థులు అవస్థలు పడాల్సి వస్తుంది. బీటెక్ వివిధ కోర్సుల్లో సీటు సాధించిన విద్యార్థులు గురువారం నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు సర్టిఫికెట్స్ సమర్పించి అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో గురువారం పలువురు విద్యార్థులు తమ తల్లిదండ్రులు, సహాయకులతో కలిసి అన్నెపర్తి వద్ద ఉన్న యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్నాక అడ్మిషన్ల ప్రక్రియ వర్సిటీలో కాదని, పానగల్‌లోని కళాశాలలో చేపట్టినట్లు తెలిపారు. దీంతో చేసేదేమి లేక విద్యార్థులు తమ వారితో కలిసి వర్సిటి నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని పానగల్ కాలేజీకి చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లాక అడ్మిషన్ దరఖాస్తు ఫారం ఇవ్వాలంటే రూ.250 చాలనా ఎస్బీఐ బ్యాంక్‌లో చెల్లించి సంబందిత జనరల్ కాపీని సమర్పించాలని అధికారులు తెలిపి చాలనా ఫారం విద్యార్థులకు అందచేశారు.
మళ్లీ చేసేదేమి లేక విద్యార్థులు నల్లగొండ పట్టణంలోని బ్యాంక్ వద్దకు, అక్కడి నుంచి తిరిగి పానగల్ కళాశాలకు రాను పోను ఆటో చార్జీలు రూ.200, బ్యాంక్ కమీషన్ చార్జీ రూ.70 అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఇంత తిరిగినా పలువురు విద్యార్థులు సమయానికి చలానా చెల్లించలేకపోయారు. దీంతో వారు మళ్లీ శుక్రవారం రావాల్సిన పరిస్థితి తలెత్తింది. అడ్మిషన్ల ప్రక్రియపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఇలా వ్యయప్రయాసలకు గురి చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు వర్సిటీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తారనే కనీస ఆలోచన లేకుండా అక్కడ బ్యాంక్ కౌంటర్ ఏర్పాటు చేయకపోవడంపై మండిపడ్డారు. ఈ విషయమై ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవిని “నమస్తే తెలంగాణ” ఫోన్ ద్వారా సంప్రదించగా అడ్మిషన్ల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఇంజినీరింగ్ అడ్మిషన్లు పానగల్ క్యాంపస్‌లోనే చేపడుతున్నట్లు చెప్పారు. అయినా విద్యార్థులు, తల్లిదండ్రుల సమాచారం నిమిత్తం ఇందుకు సంబందించి ప్రకటన జారీ చేస్తూ అవగాహన కల్పిస్తామన్నారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి ‘న్యాక్’ బృందం వస్తుందంటే ఎస్బీఐ అన్నెపర్తి బ్రాంచ్ కౌంటర్ దర్శనమిస్తుంది. ఆ తర్వాత మళ్లీ అది ఉండదు. దీంతో నిత్యం యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులు, కళాశాలల వారు యూనివర్సిటీకి పరీక్ష ఫీజులు, ఇతర ఫీజులు చెల్లించాలంటే యూనివర్సిటీ నుంచి సుమారు 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న అన్నెపర్తి బెటాలియన్ సమీపంలోని ఎస్బీఐకి జాతీయ రహదారి వెంట పరుగులు తీయాల్సిందే. ఇప్పటికైనా యూనివర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి వర్సిటీ లోపల బ్యాంక్ కౌంటర్ ఏర్పాటు చేస్తే తమకు తిప్పులు తప్పుతాయని కళాశాలల యాజమన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉంది నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారుల తీరు. టీఎస్ ఎప్‌సెట్ ర్యాంకులు సాధించి మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ సీటు వచ్చిన విద్యార్ధినీ, విద్యార్థులు తమ సర్టిఫికెట్లతో పానగల్‌లోని కళాశాలకు వెళ్లి రిపోర్టు చేయాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డా. సిహెచ్. సుధారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారమ్‌తో పాటు రూ.250 చలానా చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు కళాశాల అధ్యాపకులు డా. విజయకుమార్ 9490565566, వేణుగోపాల్ 9640705745 సంప్రదించాలని పేర్కొన్నారు.