హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నీట్ వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశాయి. హైదరాబాద్లోని ముఖ్దూం భవన్లో వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఎన్టీఏ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించాయి.
నీట్ పరీక్షను ఎన్టీఏతో నిర్వహించకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీకయ్యిది.”అని చెప్పడం అత్యంత దుర్మార్గపు, బాధ్యతారాహిత్య ప్రకటన అని మండిపడ్డారు. సమావేశంలో కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్టా లక్ష్మణ్(ఎఐఎస్ఎఫ్), టీ నాగరాజు, డీ కిరణ్ (ఎస్ఎఫ్ఐ), అనిల్,(పీడీఎస్యూ) పీ మహేశ్, పొడపంగి నాగరాజు (పీడీఎస్యూ), విజయ్ (పీడీఎస్యూ విజృంభణ), నితీశ్(ఎఐడీఎస్వో), ఎస్.నాగేశ్వరరావు (జార్జ్జిరెడ్డి పీడీఎస్యూ), పల్లె మురళి (ఏఐఎప్డీఎస్) తదితరులు పాల్గొన్నారు.