
సర్కారీ స్కూళ్లలో పైసా ఖర్చు లేదు.. నాణ్యమైన విద్యాబోధన.. పైగా ఉచిత మధ్యాహ్న భోజనం.. ఇంతకన్నా ఇంకేం కావాలి. అందుకే పిల్లలంతా సర్కారు బడి బాట పడుతున్నారు. గతంతో పోల్చితే భారీసంఖ్యలో విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. మరోవైపు, చదువంతా ఆన్లైన్ కావటంతో పిల్లల కోసమే తల్లిదండ్రులు ఫోన్లు కొనిస్తున్నారట. ఒక్క తెలంగాణలోనే 79.3 శాతం మంది పిల్లల వద్ద స్మార్ట్ఫోన్లు ఉన్నాయట. దేశవ్యాప్తంగా నిర్వహించిన అసర్-2021 సర్వే నివేదికలో పలు కీలకాంశాలు వెల్లడయ్యాయి.
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూళ్లతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గత మూడేండ్లలో సర్కారీ బడుల్లో అడ్మిషన్లు భారీగా పెరిగాయని, అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో చేరికలు తగ్గాయని వార్షిక విద్యానివేదిక(అసర్-2021) తెలిపింది. దేశవ్యాప్తంగా 25 రాష్ర్టాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 5-16 ఏండ్ల మధ్య వయసున్న 75,234 మంది పిల్లలపై సర్వే నిర్వహించారు. అందులో పలు కీలక విషయాలు తెలిశాయి. సర్వేలో కీలకాంశం ఏంటంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నవారిలో బాలుర కంటే బాలికలే ఎక్కువ కావటం.
తెలంగాణ విషయానికి వస్తే 2018లో 56.4 శాతం విద్యార్థులు సర్కారు బడుల్లో చేరగా, 2021లో 60.0 శాతం విద్యార్థులు చేరారు. ఈ ఏడాది 2.5 లక్షల విద్యార్థులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల విషయంలో ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్ తొలి మూడు స్థానాల్లో ఉండగా, తెలుగు రాష్ర్టాలు ఏపీ, తెలంగాణ ఆరు, తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి. అటు.. ప్రైవేట్ ట్యూషన్లు చెప్పించుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఇతర రాష్ర్టాలతో పొల్చితే, మన రాష్ట్రంలో తక్కువగా ఉన్నది. బీహార్లో 73.5 శాతం, ఒడిశాలో 66.2 శాతం విద్యార్థులు ట్యూషన్లకు వెళ్తుండగా, తెలంగాణలో 9.6 శాతం విద్యార్థులే ట్యూషన్లు చెప్పించుకొంటున్నారు.
ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో పిల్లల కోసం తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్లు కొంటున్నట్టు సర్వేలో తేలింది. ఒక్క 2021లోనే 27.9 శాతం తల్లిదండ్రులు పిల్లల కోసం ఫోన్లు కొన్నారట. తెలంగాణ విషయానికి వస్తే 79.3 శాతం విద్యార్థుల వద్ద స్మార్ట్ఫోన్లు ఉన్నాయట. గతంతో పోల్చితే రాష్ట్రంలో 35 శాతం విద్యార్థులు అధికంగా స్మార్ట్ఫోన్లను సమకూర్చుకొన్నారు. జాతీయంగా 67.6 శాతం విద్యార్థులు స్మార్ట్ఫోన్లు కలిగి ఉండగా, తెలంగాణలో జాతీయ సగటు కన్నా 12 శాతం అధికంగా స్మార్ట్ఫోన్లు కలిగి ఉండటం విశేషం.
దేశవ్యాప్తంగా 38.2 శాతం స్కూళ్లు మాత్రమే తెరుచుకొని, తరగతులు నిర్వహిస్తుండగా, 41.2 శాతం స్కూళ్లు ఇప్పటివరకు తెరుచుకోలేదు. దీంతో చదువుల మీద ప్రభావం పడుతున్నదని అసర్ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.