హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): యువతను సాంకేతిక రంగంలో ప్రోత్సాహం అందించాలనే సత్సంకల్పంతో నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రారంభించిన టీ-హబ్ లక్ష్యాన్ని నేటి కాంగ్రెస్ సర్కార్ నీరుగారుస్తున్నది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా విరాజిల్లిన హైదరాబాద్ టీ-హబ్ ప్రతిష్ఠ మసకబారుతున్నది. ఎంతోమంది యువత ఆలోచనలకు అంకురాలుగా ఊపిరి పోసుకున్న ఆ స్థలం.. ఇప్పుడు ఇతర కార్యాలయాల కార్యకలాపాలకు కేంద్రం కానున్నది. నాడు బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన టీ-హబ్ లక్ష్యం కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో నీరు గారుతున్నది.
మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు టీహబ్‌లోని 65,000 స్కేర్ ఫీట్ల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం బేగంపేటలో ఉండే కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంతోపాటు వట్టి నాగులపల్లిలో ఉన్న శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (ఎస్ఆర్వో), నార్సింగిలో ఉన్న గండిపేట ఎస్ఆర్వో, కూకట్‌పల్లిలోని ప్రశాంత్నగర్తోపాటు మూసాపేటలో ఉన్న రంగారెడ్డి ఎస్ఆర్వోతో పాటు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలను టీహబ్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొన్నది.
తెలంగాణ ప్రత్యేక రాష్టం ఆవిర్భవించిన తర్వాత తొలి టీ-హబ్‌ను గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. ఇందుకు 70,000 స్కేర్ ఫీట్ల స్థలాన్ని కేటాయించారు. నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో రతన్ టాటా, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దీనిని ప్రారంభించారు. టీ-హబ్‌కు వస్తున్న ఆదరణను చూసిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం టీ-హబ్ (2.0)ను ప్రారంభించింది.
3.70 లక్షల స్కేర్ ఫీట్ల విస్తీర్ణంలో రూ.400 కోట్ల వ్యయంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించగా.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2022 జూన్ 28న దానిని ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా ఇది విరాజిల్లింది. గత పదేండ్లలో 10,804 స్టార్టప్‌లు తెలంగాణలో ఏర్పాటయ్యాయని ఇటీవల డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కేంద్ర గణాంకాలు సైతం వెల్లడించాయి. దేశంలోనే స్టార్టప్‌లలో రాష్ట్రం ఏడో స్థానంలో నిలిచినట్టు గణాంకాలు వెల్లడించాయి.
తెలంగాణకు స్టార్టప్ సంస్థలు క్యూకట్టడంలో కీలకంగా మారిన టీ-హబ్‌ను కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నదని యువత మండిపడుతున్నది. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో కొత్త కంపెనీలను తేవడం మాట దేవుడెరుగు.. అంకుర సంస్థలకు నెలవుగా విరాజిల్లుతున్న టీ-హబ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్వీ నేతలు భగ్గుమంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో టీ-హబ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నిర్ణయం రానున్న రోజుల్లో ప్రభావం చూపుతుందని అక్కడి సంస్థల సిబ్బంది చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ఈ అంశంలో ఎలా ముందుకెళ్తుందో చూశాకే తమ నిర్ణయం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. టీ-హబ్‌లో ప్రభుత్వ ఆఫీసులకు స్థలం కేటాయించడంపై సీఈవోను వివరణ కోరేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. టీ-హబ్ స్థలాన్ని ప్రభుత్వ కార్యాయాలకు కేటాయించిన అంశంపై ఎవరూ మాట్లాడొద్దని కార్యాలయ వర్గాలను ఉన్నతాధికారులు హెచ్చరించినట్టు తెలిసింది.