Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ట్రంప్ ఎడమ చేతిపై గాయం కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వస్తున్నాయి.
ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రపంచ నేతలతో చర్చలు జరుపుతున్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోల్లో ట్రంప్ ఎడమ చేతిపై గాయం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే. దీనిబపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ స్పందించారు. దావోస్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో సంతకాలు చేసే సమయంలో టేబుల్ కార్నర్ తగడంలో అధ్యక్షుడు ట్రంప్ చేతికి గాయమైందని వెల్లడించారు. వెంటనే దెబ్బకు చికిత్స తీసుకున్నట్లుగా తెలిపారు. ట్రంప్ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ షాన్ బార్బబెల్లా తెలిపారు. ట్రంప్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్‌లో తగిలిన దెబ్బకు చికిత్స తీసుకున్నానని ట్రంప్ తెలిపారు. డాక్టర్లు సూచించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఆస్ప్రిన్ తీసుకుంటున్నట్లుగా కూడా పేర్కొన్నారు.
ట్రంప్ ఆరోగ్యంపై గతంలో కూడా చాలా వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఇలా ట్రంప్ చేతికి గాయాలు ఉన్న ఫొటోలు కనిపించాయి. దీంతో ఇతరులతో షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇలా ట్రంప్ చర్మం కమిలిపోయినట్లు అయ్యి గాయం అవుతుందని వార్తలు వచ్చాయి. దీనిపైపెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో వైట్‌హౌస్ వాటిని ఖండించింది. కానీ మళ్లీ ఇప్పుడు ట్రంప్ అదే సమస్యతో కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది.