Smrithi Mandhana | భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దుకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పలాశ్ ముచ్చల్ మోసం చేయడంతోనే స్మృతి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చేలా ఆమె ఫ్రెండ్, నటుడు విద్యాన్ మానే కీలక విషయాలను వెల్లడించారు. ఈ మేరకు మహారాష్ట్రలోని సాంగ్లీ పోలీస్ స్టేషన్లో పలాశ్ ముచ్చల్‌పై ఫిర్యాదు కూడా చేశారు. విడుదల కాని ఓ సినిమాకు పెట్టుబడి పేరుతో పలాశ్ తనను రూ.40లక్షలు మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
“2025 నవంబర్ 23 జరిగిన పెళ్లి వేడుకలకు నేను వెళ్లా. ఆ సమయంలో వేరే యువతితో బెడ్‌పై ఉండగా పలాశ్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అది చాలా భయంకరమైన సన్నివేశం. అది చూసిన మహిళా క్రికెటర్లు పలాశ్ను కొట్టారు. అతని ఫ్యామిలీ మొత్తం మోసగాళ్లే (చిండీచోర్). పెళ్లి తర్వాత పలాశ్ అతను సాంగ్లీలో స్థిరపడతాడని అనుకున్నా. కానీ అంతా తలకిందులైంది.“ అని ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యాన్ మానే వెల్లడించారు. విద్యాన్ మానే స్మృతి మంధానకు చిన్ననాటి స్నేహితుడు. మంధాన కుటుంబం ద్వారానే అతనికి పలాశ్‌తో పరిచయం ఏర్పడింది.
స్మృతి మంధాన – పలాశ్ ముచ్చల్ వివాహం గతేడాది నవంబర్ 23న వివాహం జరగాల్సి ఉంది. కానీ అదే రోజు స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆ రోజు జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. అప్పట్లో రెండు కుటుంబాల్లో అనారోగ్య సమస్యలే పెళ్లి వాయిదాకు కారణమని మీడియాకు వెల్లడించారు. కానీ పలాశ్ మోసం చేయడంతోనే స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఇరు కుటుంబాలు స్పందించలేదు. ఇలాంటి సమయంలో స్మృతి ఫ్రెండ్ విద్యాన్ మానే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఇదిలా ఉండగా.. విద్యాన్ మానే చేసిన ఆరోపణలను పలాశ్ ముచ్చల్ తరఫు న్యాయవాది శ్రేయాంశ్ మిథారే తీవ్రంగా ఖండించారు. ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ” పలాశ్‌కు విద్యాన్ మానే డబ్బులు ఇచ్చినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. చెక్ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ వంటి వివరాలేవి లేవు. మరో యువతితో పలాశ్ పట్టుబడ్డాడు అన్న ఆరోపణలకు ఆధారాలేంటి? విద్యాన్ మానే ఎవరో కూడా మాకు తెలియదు. స్మృతి తండ్రి శ్రీనివాస్ ద్వారా మాత్రమే అతడిని కలిశాం. పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాతే అతడు బయటకు రావడం అనుమానాస్పదంగా ఉంది. “ అని తెలిపారు. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.