గాజా స్ట్రిప్ : గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులు మరింత పెరిగాయి. దీంతో 24 గంటల వ్యవధిలో సుమారు 60 మంది మరణించారు. వీరు ఖాన్ యూనిస్, డెయిర్ అల్-బలాహ్ పట్టణాలు, జబలియా శరణార్థుల శిబిరాలకు చెందినవారు. గాజా హెల్త్ మినిస్ట్రీ శుక్రవారం ఈ వివరాలను తెలిపింది.
హమాస్ నిర్బంధంలో ఉన్న 58 మంది ఇజ్రాయెలీలను విడుదల చేసే వరకు, హమాస్ ఆయుధాలను వదిలిపెట్టే వరకు ఈ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇదిలావుండగా, గాజాలోకి మానవతా సాయాన్ని అనుమతించేందుకు అంతర్జాతీయ ఒత్తిళ్ల మేరకు ఇజ్రాయెల్ అంగీకరించింది. గోధుమ పిండి, ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలతో 100కుపైగా లారీలను అనుమతించింది. ఇది సరిపోదని ఐక్య రాజ్య సమితి ఏజెన్సీలు చెప్తున్నాయి.