– నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి
నీలగిరి, జనవరి 29 : ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ కొలను శివరాంరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో గురువారం నల్లగొండ పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు అలాగే సస్పెక్ట్ షీటర్లకు తన కార్యాలయంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం జరుగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రౌడీ షీటర్లు ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని, బైండోవర్, నేర చరిత్ర కలిగిన ప్రతి ఒక్కరిని తాసీల్దార్ ఎదుట హాజరుపరిచి, వారి నుండి మంచి ప్రవర్తన కలిగి ఉంటామని బాండ్ రాయించాలన్నారు.
బాండ్ నిబంధనలు ఉల్లంఘిస్తే, బాండ్ మొత్తాన్ని జప్తు చేయడంతో పాటు జైలు శిక్ష విధించనున్నట్ల తెలిపారు. రౌడీ షీటర్ల కదలికలపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని, ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకూడదు, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయవద్దన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడంతో పాటు, అవసరమైతే జిల్లా బహిష్కరణ వేటు వేస్తామని ఆయన హెచ్చరించారు. పాత పద్ధతులు మార్చుకుని, సత్ప్రవర్తనతో జీవించాలని, లేదంటే కుటుంబాలు ఇబ్బందుల పాలవుతాయని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐలు ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి, రాఘవ రావు, ఎస్ఐలు సైదులు, సతీష్, గోపాల్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Nilagiri : ‘శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు’