పెంచికల్ పేట్ : బాల్య వివాహాలు ( Child Marriages ) చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీవో బుర్ల మహేష్( DCPO Mahesh) హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని చెడ్వాయి కొత్తగూడెం గ్రామానికి చెందిన మైనర్ బాలికకు బాల్య వివాహం జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు గ్రామాన్ని సందర్శించి బంధువులు, కుటుంబ సభ్యులు,కుల పెద్దలకు కౌన్సిలింగ్ (Counseling) ఇచ్చారు. బాల్య వివాహం వల్ల ఎదురయ్యే నష్టాలను, కేసుల ద్వారా ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని బాల్య వివాహాలు చేస్తే రెండు సంవత్సరాల జైలు శిక్ష ,లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నామని వెల్లడించారు. అంతేగాకుండా నాన్బెయిలెబుల్ కేసులను నమోదు చేస్తామని తెలిపారు. 2030 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన బాల్య వివాహ రహిత భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన వివరించారు. ఎ
క్కడైనా బాల్య వివాహాలు జరిగినట్లు దృష్టికి వస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1098 , 112 లకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ రవళి, ఐసీడీఎస్ సూపర్వైజర్ హసీనా, కానిస్టేబుల్ సురేష్, సాయిలత పాల్గొన్నారు.