నీట్ పేపర్ లీక్‌పై కఠిన చర్యలు ఉంటాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా. శుక్రవారం కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నాం. పేపర్ లీకేజ్ ఘటనపై రెండున్నర నెలల్లో అనేక సమర్థవంతమైన చర్యలు తీసుకున్నాం. నిందితులను పట్టుకున్నాం. విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడాలన్న ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాం.
– గురువారం అర్ధరాత్రి వీడియో సందేశంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జూలై 23 : దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నీట్ పేపర్ లీకేజ్‌పై ప్రధాని మోదీ ఎట్టకేలకు స్పందించారు. నీట్ పేపర్ లీక్‌పై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటించారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై ప్రధాని మోదీ గురువారం అర్ధరాత్రి ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా. శుక్రవారం కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నాం. పేపర్ లీకేజ్ ఘటనపై గత రెండున్నర నెలల్లో అనేక సమర్థవంతమైన చర్యలు తీసుకున్నాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాలని సంబంధిత శాఖలను ఆదేశించా’ అని చెప్పారు. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితులను పట్టుకున్నామని, విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడాలన్న ప్రభుత్వ బాధ్యతను తాము నెరవేర్చామని చెప్పారు.
దీనికంటే ముందు పరీక్ష లీకేజీ కేసుల్లో సకాలంలో విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించారు. ప్రధాని ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల చట్టం (అక్రమ పద్ధతుల నివారణ) పరిధిలోకి వచ్చే నేరాలు, సంబం ధిత కేసులను ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారిస్తుందని పేర్కొంది.