– మూడు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించి జిల్లాకు కీర్తి
చుంచుపల్లి, జూన్ 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువ బాక్సర్లు రాష్ట్రస్థాయి పోటీల్లో తమ ప్రతిభను చాటి పలు పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. హైదరాబాద్లోని గౌలిపురాలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన అండర్-15 రాష్ట్రస్థాయి బాల, బాలికల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. 33 కేజీల విభాగంలో టీ.మణికంఠ రజత పతకాన్ని, 70 కేజీల విభాగంలో ఎ.జోనతన్ రజత పతకాన్ని, 70 ప్లస్ కేజీల విభాగంలో కె.సోహిత్ చంద్ర రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే బాలికల 40 కేజీల విభాగంలో కె.భావన కాంస్య పతకాన్ని సాధించి జిల్లాకు మరో విజయాన్ని అందించింది.
రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు సాధించిన విజయాలపై కోచ్ శ్రీనివాస్ మట్టపర్తి హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారుల కృషి, పట్టుదల ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలను జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామ రెడ్డి, మట్టపర్తి రమేశ్ అభినందించారు. రాష్ట్రస్థాయిలో రాణించిన క్రీడాకారులు భవిష్యత్లో జాతీయ స్థాయిలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో సాధించిన ఈ విజయాలు జిల్లాలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.