మాగనూరు : బీఆర్ఎస్ నాయకుడు , మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) పై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివరాం రెడ్డి చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ ( BRS ) మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి ( Yellareddy ) తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముంపు గ్రామాలైన నేరడగం, భూత్పూర్ ప్రజల సంక్షేమం కోసం ఆర్అండ్ఆర్ సెంటర్ల ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్యే జీవోలు తీసుకొస్తే ఆ జీవోలను రద్దు చేయించారని కాంగ్రెస్ నాయకుడు శివరాం రెడ్డి అసత్యపు ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. జీవోలను రద్దు చేయించిన ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
నేరడగం దళిత సర్పంచ్‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటామని చెప్పి పిలిపించి అవమానించింది కాంగ్రెస్ నాయకులు కాదా అని ప్రశ్నించారు. ప్రజల తీర్పును గౌరవించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం సర్పంచ్‌ను అవమానించడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మక్తల్ 150 పడకల ఆస్పత్రి భవనం, ఫైర్‌స్టేషన్, కోర్టు, డిగ్రీ కళాశాల, చిట్యాల–మందిపల్లి వంతెనతో పాటు అనేక అభివృద్ధి పనులకు అనుమతులు, నిధులు మంజూరు చేసిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో మాగనూరు మండలానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టమైన లెక్కలు చెప్పాలని ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో ఉద్యమకారుడు పూల రాములు, సర్పంచులు నర్సింలు, లక్ష్మన్న, రఘు, మాజీ సర్పంచులు నర్సింలు, మల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, గ్రామ అధ్యక్షులు అశోక్ గౌడ్, పల్లె మారెప్ప, బింగి తాయప్ప, గజపతి పాల్గొన్నారు.