AP News | తిరుపతి: తిరుపతి జిల్లా భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO)గా ఎన్ వెంకటరమణ పనిచేసేవారు. ఆయన ఏడాది క్రితం భాకరాపేట చెక్‌పోస్టు వద్ద రూ. 50 లక్షల సిగరెట్లను సీజ్ చేశారు. వాటిని ప్రభుత్వానికి అప్పగించకుండా గుట్టుచప్పుడు కాకుండా వేరేవారికి విక్రయించాడు. విచారణలో అది రుజువు కావడంతో వెంకటరమణను శుక్రవారం సస్పెండ్ చేశారు.
చెన్నై నుంచి అక్రమంగా తరలిస్తున్న సిగరెట్ లోడును గతేడాది భాకరాపేట (Bhakarapeta) ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద ఫారెస్ట్ ఆఫీసర్ వెంకటరమణ పట్టుకున్నాడు. సీజ్ చేసిన ఆ సిరెట్లను విక్రయించి సొమ్ముచేసుకున్నాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. కానీ జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో తిరుపతి జీవకోనకు చెందిన జి మునిగోపాల్ ఈ విషయంపై అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన డిప్యూటీ సీఎం దీనిపై విచారణకు ఆదేశించారు.
అటవీ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా ఎఫ్ఆర్వో వెంకటరమణ వ్యవహారం బయటపడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ వెంకటాచలపతి అతడిని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆయన హెడ్‌క్వార్టర్స్ భాకరాపేటలోనే ఉండాలని, అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లరాదని ఉత్తర్వులు జారీ చేశారు.