ప్రధాని ఇటీవలే హైదరాబాద్ వచ్చి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ పచ్చబడుతున్న పల్లెలను చూసిండో లేక తెల్లగా ఉన్న పట్టణాలను చూసిండో ఏమోగాని ఆయన కడుపు మండింది. ఆయనకు తెలంగాణ ఎందుకు నచ్చలేదో, కేసీఆర్ అంటే ఎందుకు గిట్టలేదో! గుజరాత్ కంటే తెలంగాణ ప్రగతి పథాన సాగుతున్నదని ఆయన బాధైనట్టున్నది. కడుపు మండింది. అందుకే పార్లమెంట్లో అసందర్భంగా తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు.
-మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): గుజరాత్ కంటే తెలంగాణ ముందుకు దూసుకుపోతున్నదనే బాధ ప్రధానమంత్రి మోదీ మనసులో ఉన్నట్టున్నదని.. అందుకే పార్లమెంటులో తెలంగాణ గురించి అసందర్భంగా మాట్లాడి, అక్కసు వెళ్లగక్కారని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. గుండెలనిండా ప్రేమను పంచాల్సిన ప్రధాని.. గునపాలు దించుతారా? అని ప్రశ్నించారు. పార్లమెంట్లో అసహ్యంగా మాట్లాడిన ప్రధాని తెలంగాణ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి.. వాటిని అద్భుతంగా సాధిస్తున్న కేసీఆర్ లాంటి దక్షత కలిగిన నాయకుడిని చూసి కొందరికి కండ్లల్లో నిప్పులు పోసినట్టున్నదని మోదీని ఉద్దేశించి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ప్రధాని ఇటీవలే హైదరాబాద్ వచ్చి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ పచ్చబడుతున్న పల్లెలను చూసిండో లేక తెల్లగా ఉన్న పట్టణాలను చూసిండో ఏమోగాని ఆయన కడుపుమండింది. ఆయనకు తెలంగాణ ఎందుకు నచ్చలేదో, కేసీఆర్ అంటే ఎందుకు గిట్టలేదో! గుజరాత్ కంటే తెలంగాణ ప్రగతి పథాన సాగుతున్నదని ఆయన బాధైనట్టున్నది. కడుపుమండింది. అందుకే పార్లమెంట్లో అసందర్భంగా తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు’అని మండిపడ్డారు.
ముందు నుంచి పగే
తెలంగాణ అంటే మోదీకి ముందు నుంచీ పగ అని, అందుకే కత్తిగట్టినట్టు వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ఆయన మొదటి నుంచీ తెలంగాణ మీద పగబట్టిండు. తెలంగాణ ఏర్పడంగనే చంద్రబాబు ఒత్తిడిచేస్తే, మనకు ఇష్టం లేకపోయినా ఏడు మండలాలను గుంజుకొనిపోయి ఆంధ్రాలో కలిపిండు. మనం విద్యుత్తు కోతలతో ఇబ్బందులు పడుతుంటే 480 మెగావాట్ల లోయర్ సీలేరు విద్యుత్తు ప్లాంటును ఆంధ్రాలో కలిపిండు. ప్రధాని అంటే కొత్త రాష్ర్టానికి గుండెల నిండా ప్రేమ పంచాలి. కాని గుండెల్లో గునపాలు దించేలా మాట్లాడటం విడ్డూరం. ఎనిమిదేండ్ల కింద జరిగిపోయినదాన్ని పట్టుకొని ఇంకా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యమేసింది. వ్యవసాయంపై నల్ల చట్టాలు తెచ్చి.. రైతులు పోరాటం చేయడంతో దిక్కులేక రద్దుచేసి.. విధిలేక క్షమాపణ చెప్పారు. ఇదే తరహాలో ప్రధాని.. మా యాభై ఏండ్ల పోరాటాన్ని, వందలమంది త్యాగాన్ని అవమానించినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
పనికిమాలిన మాటలు
ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రధాని పచ్చి అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ విమర్శించారు. గతంలో ఒకసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ అన్నారని గుర్తుచేశారు. ‘ఎనిమిదేండ్ల కింద మాట్లాడినరంటే ఓ అర్థమున్నది. ఇప్పుడెందుకు మాట్లాడినట్టు?’ అంటూ మోదీని ప్రశ్నించారు. విశ్వాసం నింపాల్సిన చోట విద్వేషపు మాటలా?’ అని దుయ్యబట్టారు. ‘1998లో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ కాకినాడ తీర్మానం చేసింది. తర్వాత చంద్రబాబు సంకలజొచ్చి కాకినాడ తీర్మానాన్ని కాకెత్తుకెళ్లిందని చెప్పి మోసం చేసింది. ఆనాడు ఒక ఓటు రెండు రాష్ర్టాలను విస్మరించిన పార్టీకి చెందిన ప్రధాని, ఈనాడు ఒక నోరు.. రెండు నాల్కలన్నట్లు మాట్లాడటం నన్ను బాధించింది. ప్రధానిగా మోదీ అలా మాట్లాడాల్సింది కాదు. ఇంత అన్యాయంగా.. అసంబద్ధంగా, అర్థరహితంగా ఇష్టంవచ్చినట్టు ప్రజాస్వామ్య దేవాలయంలో మాట్లాడటమంటే ప్రజాస్వామ్య ప్రక్రియను కించపర్చడమే’ అని మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. మోదీ మాటలు.. అమరుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాన్ని అవమానించినట్టేనని అన్నారు.
ఇచ్చింది గుండు సున్న..
ప్రధానిగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 157 మెడికల్ కాలేజీలు, 6 ఐఐఎంలు, 87 నవోదయ, 8 ఎన్ఐడీ, ఐఐఎస్ఈఆర్లు ఇలా ఎన్నో మంజూరుచేసినా.. తెలంగాణకు ఇచ్చింది గుండు సున్న అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మిషన్ కాకతీయ, భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా పైసా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరపైసా ఇవ్వకపోగా ప్రజాస్వామ్య ప్రక్రియను అవమానించేలా మాట్లాడటం మోదీకే చెల్లిందన్నారు. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఇస్తమన్న హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, పారిశ్రామిక రాయితీలు ఏవీ ఇవ్వలేదని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయహోదా కోరితే ఉలుకూ పలుకూ లేదని విమర్శించారు. కర్ణాటకలోని అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు ఆగమేఘాల మీద జాతీయహోదా ఇచ్చి మాకు ఇవ్వరా? అంటూ నిలదీశారు. ‘ఫార్మాసిటీ కట్టుకొంటున్నం సాయం చేయాలని కోరితే అరపైసా సాయం చెయ్యరు. టెక్స్టైల్ పార్కు పెట్టుకొంటున్నం సాయం చెయ్యాలంటే చెయ్యరు’ అని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు.
బేటీ డరావో.. బేటీ ధమ్కావో ఇదీ మీ నీతి
చదువుకోవడానికి ఆడపిల్లలు కాలేజీలకు పోతే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మతం పేరిట విద్యాలయాల్లో చిచ్చుపెట్టిందని, మూడు రోజులు విద్యాసంస్థలను బంద్ చేయాల్సిన దుస్థితి అక్కడ నెలకొన్నదని కేటీఆర్ విమర్శించారు. ‘మోదీ ఒక దిక్కేమో ‘బేటీ బచావో -బేటీ పడావో’ అంటడు. ఇంకో దిక్కేమో ఆడపిల్ల చదువుకొనేందుకు పోతే ‘బేటీ డరావో.. బేటీ ధమ్కావో’ అంటున్నారు. ఇదీ బీజేపీ నీతి’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘ఆడపిల్లలను బెదిరిస్తున్నరు.. ఉరికిస్తున్నరు. ఇదేనా మీరు కోరుకున్న భారతదేశం?’ అని నిలదీశారు. మతం పేరుమీద చిన్నారుల మనసులలో విషం నింపి.. విద్వేషపు మంటల మీద చలికాచుకొనే ప్రయత్నాలను బంద్ చేయాలని హితవు పలికారు.
మోదీ రాజ్యాంగం నడుస్తున్నది
బోధించు.. సమీకరించు.. పోరాడు.. అన్న సూత్రాన్ని అనుసరించి, అంబేద్కర్ బాటలో నడిచి రాష్ర్టాన్ని సాధించుకొన్నామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. నిజమైన అంబేద్కర్‌వాదిగా కేసీఆర్‌ను మించినవాళ్లు ఎవరూ లేరన్నారు. ‘దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగమెక్కడున్నది? అంతా నరేంద్రమోదీ రాజ్యాంగం నడుస్తున్నది’ అని మండిపడ్డారు. గవర్నర్, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకొని, మోదీ ఆడించినట్లు ఆడే నాటకం దేశంలో సాగుతున్నదని విమర్శించారు. ‘పశ్చిమబెంగాల్లో గవర్నర్‌ను ముఖ్యమంత్రి బ్లాక్ చేసే పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఇవీ నరేంద్రమోదీ రాజ్యాంగంలో తలెత్తుతున్న పరిస్థితులు’ అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ మీద విషం చిమ్మే బీజేపీని తెలంగాణలోని బుద్ధిజీవులు, విద్యావంతులు ఓ కంట కనిపెట్టాలని కోరారు. టీవీలు, పత్రికల్లో చూస్తున్న ప్రజలంతా వాస్తవాలను గ్రహించి బీజేపీ పట్ల జాగత్త్రగా ఉండాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ వెంట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.