Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియా (West Asia) లో ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో చమురు ధరలు భగ్గుమన్నాయి. దాంతో సూచీలు వరుసగా మూడోరోజూ నష్టాల బాటలోనే కొనసాగుతున్నాయి. ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 523 పాయింట్లు క్షీణించి.. 75,066 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 125 పాయింట్లు కోల్పోయి.. 23,509 వద్ద కదలాడుతోంది.
ట్రేడింగ్ ప్రారంభంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.88గా ఉంది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా, మ్యాక్స్ హెల్త్‌కేర్, లార్సెన్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో స్టాక్స్ నష్టపోతున్నాయి. ఇరాన్-అమెరికా దాడులతో హర్మూజ్ దద్దరిల్లుతోంది. రెండు దేశాలు 10కి పైగా చమురు ట్యాంకర్లపై దాడులు చేశాయి. దాంతో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఒక బ్యారెల్ ధర 99.49 డాలర్లకు ఎగబాకింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 94.63 డాలర్లు పలుకుతోంది.