ముంబై, డిసెంబర్ 19 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత నాలుగు సెషన్లుగా భారీగా నష్టపోయిన సూచీలకు బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వచ్చే సమీక్షలోనూ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడం, రూపాయి బలోపేతం కావడంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
ఫలితంగా ఇంట్రాడేలో 600 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 85 వేల మార్క్‌ను అధిగమించింది. చివరికి 447.55 పాయింట్ల లాభంతో 84,929.36 వద్ద ముగిసింది. అలాగే మరో సూచీ నిఫ్టీ సైతం 150.85 పాయింట్లు అందుకొని 25,966.40 వద్ద ముగిసింది. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 338 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ కూడా 80 పాయింట్లు కోల్పోయింది.