హైదరాబాద్, డిసెంబర్ 19: దేశ, విదేశీ ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర బోర్డు చర్చించింది. శుక్రవారం ఇక్కడ ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 620వ సమావేశం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఈ మీటింగ్ నడిచింది. ఈ సందర్భంగా ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆర్థిక విపత్కర పరిస్థితులు, సవాళ్లపై చర్చ చేపట్టారు. అలాగే కొన్ని సెంట్రల్ ఆఫీస్ విభాగాల కార్యకలాపాలు, గత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను దేశీయ బ్యాంకింగ్ ప్రగతి, తీరుతెన్నుల డ్రాఫ్ట్ రిపోర్టును సమీక్షించారు.
కాగా, బ్యాంకుల కోసం రిస్క్ ఆధారిత డిపాజిట్ ఇన్సూరెన్స్ విధివిధానాలను బోర్డు ఆమోదించినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు టీ రవి శంకర్, స్వామినాథన్ జే, పూనమ్ గుప్తా, శిరీష్ చంద్ర ముర్ము హాజరయ్యారు. సెంట్రల్ బోర్డు డైరెక్టర్లుగా ఉన్న ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి నాగరాజు మద్దిరాల, సతీష్ కే మరాటే, రేవతి అయ్యర్, పంకజ్ రమణ్భాయ్ పటేల్, రవీంద్ర హెచ్ ధోలాకియాలు హాజరయ్యారు.