Ilambarthi | సిటీబ్యూరో: గ్రేటర్లో వీధి కుక్కల బెడద నివారణకు స్టెరిలైజేషన్ అధిక సంఖ్యలో చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కమిషనర్ ఎల్బీనగర్ జోనల్ ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రాన్ని, డాగ్ క్యాచింగ్ వెహికల్, కుక్కల ఆపరేషన్ థియేటర్, పెంపుడు కుక్కల క్రిమిటోరియం, సీ అండ్ డీ ప్రాసెసింగ్ ప్లాంట్లను పరిశీలించారు. రోజుకు ఎన్ని కుక్కలను పట్టుకుంటున్నారు? ఎన్నింటికీ స్టెరిలైజేషన్ జరుగుతున్నాయి’ అంటూ కమిషనర్ చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్‌ను అడిగి తెలుసుకున్నారు. స్టెరిలైజేషన్ చేసిన కుక్కల వివరాలు, జోన్‌లోని సర్కిల్ వారీగా పట్టుకున్న కుక్కల వివరాలను డాక్టర్ వకీల్ కమిషనర్‌కు వివరించారు.
సర్కిల్ వారీగా వెహికల్ ఉన్న నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో వీధి కుక్కలను పట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుక్కల బెడద, కుక్క కాటు నివారణకు శస్త్ర చికిత్సలు చేసినప్పుడు మాత్రమే ఫలితాలు ఉంటాయన్నారు. పెట్డాగ్ల క్రిమిటోరియం పరిశీలించి, నెలకు ఎన్ని జరుగుతున్నాయని నిర్వాహకులను అడగ్గా, నెలకు సుమారు 30 నుంచి 35 వరకు క్రిమిటోరియం చేస్తున్నట్లు కమిషనర్‌కు వివరించారు. అనంతరం కమిషనర్ భవన నిర్మాణ వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా 500 టన్నుల కెపాసిటీతో నాలుగు భవన నిర్మాణ వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి కమిషనర్‌కు వివరించారు.