ఆదిలాబాద్ : ప్రపంచ టొబాకో నిరోధక దినోత్సవ సందర్భంగా శనివారం ఆదిలాబాద్ ( Adilabad ) పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఉచిత దంత వైద్య పరీక్షలను నిర్వహించారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా పోలీసు సిబ్బందికి , కుటుంబ సభ్యులకు దంత వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan ) మాట్లాడుతూ టొబాకో ( Tobacco products) వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయని వెల్లడించారు.
టొబాకో, వాటి ఉత్పత్తుల వినియోగం వల్ల, సిగరెట్, గుట్కా, జర్దా వంటి ఉత్పత్తులు వల్ల క్యాన్సర్, గుండెపోటు, శ్వాసకోశలాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వివరించారు. సిబ్బంది స్వీయ నియంత్రణ క్రమశిక్షణను కలిగి ఉంటూ టొబాకో ఉత్పత్తులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. 15 మంది డాక్టర్ల బృందం 200 మంది సిబ్బందికి, కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలను నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి వారం రిమ్స్ ఆసుపత్రిలో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు నోటి క్యాన్సర్ సర్జరీలు జరుగుతాయనే విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. యువత ప్రజలు టొబాకో ఉత్పత్తుల మోసపూరిత ప్రకటనలో, వివిధ రకాల ఫ్లేవర్లతో ప్రజలను ఆకర్షించే విధంగా ఉండే ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని పేర్కొన్నారు.