ఫైనల్లో వరంగల్‌పై 5-0తో ఘన విజయం
కొత్తపల్లి: రాష్ట్ర స్థాయి పురుషుల హాకీ టోర్నీలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 5-0 తేడాతో వరంగల్‌పై ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ హైదరాబాద్ వరుస గోల్స్‌తో విరుచుకుపడింది. దీటైన పోటీనివ్వడంలో విఫలమైన వరంగల్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. షణ్ముక్సింగ్, జస్వంత్‌సింగ్ స్మారకార్థం తెలంగాణ, కరీంనగర్ జిల్లా అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ శనివారం ముగిసింది. అంతకుముందు జరిగిన వేర్వేరు సెమీస్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 5-2తో నిజామాబాద్‌పై గెలువగా, వరంగల్ 2-1తో కరీంనగర్‌ను ఓడించింది. ట్రోఫీ ప్రదాన కార్యక్రమంలో ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్, ఎడ్వర్డ్ అలోసియస్ ముఖ్య అతిథులుగా హాజరు కాగా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.