రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. మారుమూల పల్లెలకూ మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. సర్కారు దవాఖానలను అత్యాధునిక వైద్యానికి కేరాఫ్‌గా నిలిపింది. ‘ప్రైవేట్’ దోపిడీకి చెక్‌పెడుతూ కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీవిని ఎరుగని రీతిలో వసతులు కల్పించింది. వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. మాతాశిశు మరణాల రేటు తగ్గించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ‘కేసీఆర్ కిట్- అమ్మ ఒడి’ పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి సుఖ ప్రసవం తర్వాత బిడ్డ సహా సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2017 నుంచి ఇప్పటివరకు 89,481 ప్రసవాలు జరిగాయి. ఇందులో 73,583 మందికి కేసీఆర్ కిట్లు అందజేశారు. – భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ)
నేను గర్భం దాల్చిన నాటి నుంచి ప్రభుత్వ వైద్యశాలలోనే వైద్యసేవలు పొందాను. వారం రోజుల క్రితం నేను పురిటి నొప్పులతో ఖమ్మంలోని పెద్దాసుపత్రికి వచ్చాను. ఇక్కడి వైద్యులు నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. ప్రసవం తర్వాత వెంటనే కేసీఆర్ కిట్ అందింది. నాకు పుట్టింటి వాళ్లు ఇచ్చినట్లుగా అనిపించింది. కిట్‌లో నూనె, పౌడర్, బిడ్డ దుస్తులు, మినీ బెడ్, రెండు చీరెలు ఉన్నాయి. అవి ఎంతో నచ్చాయి. రూపాయి ఖర్చు లేకుండా పురుడు పోయడంతో పాటు కేసీఆర్ కిట్ అందించడం ఆనందాన్నిచ్చింది.
– అలవాల సాయికుమారి, గోవిందాపురం, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ‘సర్కారు దవాఖాన ఆధునిక వైద్యానికి కేరాఫ్. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేద, మధ్య తరగతి వర్గాల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీవినీ ఎరుగని రీతిలో వసతులు కల్పించారు. ఈ క్రమంలోనే మాతా శిశు మరణాల రేటు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 2017 జూన్‌లో ‘కేసీఆర్ కిట్- అమ్మ ఒడి’ పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి సుఖ ప్రసవం తర్వాత బిడ్డతో సహా ఇంటికి చేరుకునే వరకు ప్రభుత్వమే బాధ్యత వహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న రోగాలకే ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇక గర్భిణికి ప్రసవం చేయాలంటే కచ్చితంగా ఆర్థిక భారమే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అమలులోకి తెచ్చిన ‘అమ్మ ఒడి’ పథకం అద్భుతాలను ఆవిష్కరిస్తున్నది. మరోవైపు గర్భిణులకు విడతల వారీగా అందిస్తున్న నగదు ప్రోత్సాహకాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చేసింది. గర్భం దాల్చిన మహిళ ఐదు నెలల్లోపు ప్రభుత్వ వైద్యశాలల్లో పరీక్షలు చేయించుకుంటే రూ. 3 వేలు, ప్రసవ సమయంలో రూ. 4 వేలు, ఆడ బిడ్డకు జన్మనిస్తే రూ.5 వేలు అందిస్తున్నది. శిశువుకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చిన 14 వారాల్లో రూ.3 వేలు, 10 నెలలకు రూ.2 వేలు చొప్పున నాలుగు విడతల్లో మొత్తం రూ.12 వేలు అందిస్తున్నది. ప్రసవం తర్వాత తల్లీబిడ్డను ఉచితంగా అమ్మఒడి వాహనం ద్వారా క్షేమంగా ఇంటి వద్దకు తరలిస్తున్నారు.
ప్రభుత్వం కేసీఆర్ కిట్‌లో బిడ్డకు అవసరమైన సబ్బులు, నూనె, పౌడర్, దోమ తెర, చిన్న బెడ్, రెండు బేబీ డ్రెస్‌లు, తల్లికి రెండు చీరెలు, టవళ్లు అందిస్తున్నది. వీటి విలువ రూ.2 వేల వరకు ఉంటుంది.
సాధారణ ప్రసవాలపై అవగాహన..మహిళలు గర్భం దాల్చిన వెంటనే సమాచారం అందుకున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వారి వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేసుస్తున్నారు. సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని సిఫార్సు చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాల వైద్యులు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సుఖ ప్రసవాలే లక్ష్యంగా సేవలు అందిస్తున్నారు. కోత ఆపరేషన్లు వద్దు అని.. సాధారణ ప్రసవాలే అన్నివిధాలా శ్రేయస్కరమని గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప వైద్యులు ‘సిజేరియన్’ ఆపరేషన్ చేయడం లేదు.
కేసీఆర్ కిట్- అమ్మ ఒడి పథకాలు వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలోని సర్కార్ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో వైద్యులు రోజుకు సరాసరి 20 నుంచి 30 మందికి పురుడు పోస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2017 నుంచి ఇప్పటివరకు వైద్యసిబ్బంది 42,884 మందికి ప్రసవాలు చేశారు. వీరిలో 37,587 మందికి కేసీఆర్ కిట్లు అందించారు.
కొత్తగూడెం సర్కారు ఆసుపత్రిలో గర్భిణులకు మెరుగైన సేవలు అందుతున్నాయని తెలుసుకున్నాను. పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరాను. ఆసుపత్రి సూపరింటెండెంట్ సరళ వైద్య పరీక్షలు నిర్వహించి సాధారణ కాన్పు చేశారు. కాన్పు తర్వాత కేసీఆర్ కిట్ అందించారు. ఆస్పత్రిలో సకల వసతులు ఉన్నాయి. పిల్లల వార్డులో ప్రత్యేక వైద్యనిపుణులు వైద్యసేవలు అందిస్తున్నారు.
– బానోత్ విజయ, లబ్ధిదారురాలు, గిద్దిలగూడెం, జూలూరుపాడు మండలం, భద్రాద్రి జిల్లా
ఎనిమిది రోజుల క్రితం నేను పురిటి నొప్పులతో ప్రభుత్వాసుపత్రిలో చేరాను. మగబిడ్డకు జన్మనిచ్చాను. కడుపులోనే బిడ్డ ఉమ్మనీరు తాగడం, జన్మించిన తర్వాత కామెర్లు ఉండడంతో వైద్యలు బాక్సులో పెట్టారు. ప్రస్తుతం మా ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నది. ప్రసవం జరిగిన వెంటనే నాకు సీఎం కేసీఆర్ కిట్ అందింది. కిట్‌లోని వస్తువులన్నీ నాణ్యంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ సార్ తీసుకొచ్చిన ఈ పథకం నిరుపేదలకు ఉపయోగం.
– ధరావత్ ఝాన్సీరాణి, లబ్ధిదారురాలు, కృష్ణసాగర్, భద్రాద్రి జిల్లా
నేను పురిటినొప్పులతో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో చేరాను. వైద్య సిబ్బంది నన్ను బాగా చూసుకున్నారు. వైద్యులు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నాకూ సాధారణ ప్రసవమే చేశారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నది. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు వేచి ఉండడానికి వెయిటింగ్ హాళ్లు అందుబాటులో ఉన్నాయి. వైద్యసిబ్బంది ఎలాంటి లోటు లేకుండా గర్భిణులను చూసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కిట్ నిరుపేదలకు ఉపయోగకరం.
– కల్యాణి, లబ్ధిదారురాలు, ఎర్రగుంట, చండ్రుగొండ మండలం, భద్రాద్రి జిల్లా
నిరుపేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యసేవలు పొందలేరు. తెలంగాణ ప్రభుత్వం సర్కార్ ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేయడం, గర్భిణులకు అన్ని రకాల వసతులు కల్పించడం, కేసీఆర్ కిట్లు అందజేయడంతో ప్రసవాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 36,266 మందికి కేసీఆర్ కిట్లు అందాయి. కొత్తగూడెం పెద్దాసుపత్రిలో సకల వసతులు ఉన్నాయి.
– డాక్టర్ సుజాత, ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్, కొత్తగూడెం
కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో వంద పడకల భవనం ఏర్పాటు చేసి గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంత మంది గర్భిణులు ప్రసవాలకు వచ్చినా ఒకేసారి ప్రసవాలు చేయగలిగే వసతులు ఆస్పత్రిలో ఉన్నాయి. పిల్లల వార్డులో వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో రోజుకు సగటున 10- 20 ప్రసవాలు జరుగు తున్నాయి.
– డాక్టర్ సరళ, మెడికల్ సూపరింటెండెంట్, కొత్తగూడెం
2017 నుంచి ఇప్పటివరకు భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యసిబ్బంది 46,597 మందికి ప్రసవాలు చేశారు. వీరిలో 36,266 మందికి కేసీఆర్ కిట్లు అందాయి. తల్లుల ఖాతాల్లో రూ.3.38 కోట్ల సొమ్ములు జమయ్యాయి.