సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ)/బౌద్ధనగర్ : అర్ధరాత్రి తరువాత సికింద్రాబాద్ ప్రాంతంలో రెండు హత్యా యత్నం ఘటనలు చోటుచేసుకున్నాయి. బేగంపేట్, చిలకలగూడ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన ఈ ఘటనల్లో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. రెండు ఘటనలు ఒకే రోజు జరగడంతో నగరంలో కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ అదనపు సీపీ డీఎస్ చౌహాన్ ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఎందుకు అగావంటూ…!
రసూల్‌పూర రామలింగేశ్వరస్వామి ఆలయంలో నివాసముండే స్నేహితుడు రాఘవేంద్రను కలిసేందుకు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో స్నేహితుడైన ప్రదీప్, హేమంత్‌కుమార్, శివ, భరత్, నవీన్‌కుమార్‌లతో కలిసి వెళ్లాడు. రసూల్‌పురాకు వెళ్లిన తరువాత రాఘవేంద్రకు ప్రదీప్ ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడే నిల్చున్నారు. ఇంతలో అక్కడికి రసూల్‌పురాకు చెందిన మహ్మద్ ఒమర్, ఖాజా, మునీర్, దసర్వాద్ కృష్ణ వచ్చారు. ఎందుకు అగారంటూ ప్రశ్నించారు. దీంతో రెండు గ్రూపుల మధ్య మాటామాట పెరగడంతో ఇరువర్గాలు ఘర్షణ పడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రదీప్ తన స్నేహితులతో కలిసి బైక్‌పై అన్నానగర్‌లోని శాంతమ్మ హోటల్ వద్ద నుంచి వెళ్తూ ఇలాహి మజీద్ వద్దకు తెల్లవారు జామున 3.45 ప్రాంతంలో చేరుకున్నారు. అక్కడకు వెళ్లిన తరువాత ఒమర్ ప్రదీప్ బైక్‌ను ఆపి తిరిగి గొడవ ప్రారంభించారు. అంతలోనే మరో ఆరుగురు అక్కడకు వచ్చి దూషించారు. ఇంతలో మునీర్ తన వద్ద ఉన్న కత్తితో ప్రదీప్‌ను విచక్షణారహితంగా పొడిచాడు. మిగతా వారు అతడిపై దాడి చేశారు. దీనిపై ప్రదీప్ స్నేహితుడు హేమంత్ బేగంగపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని గాంధీ దవాఖానకు తరలించారు. నిందితులు ఖాజా, మునీర్, ఒమర్, సమీ, ఎండీ కరీమ్, మహ్మద్ శోహెబ్, దసరవాడ కృష్ణ, సయ్యద్ సమీర్‌లను అరెస్ట్ చేశారు.
చిలకలగూడలో..
కీసరలో నివాసముండే మనిపాడి సంతోశ్ కుమార్ డెంటర్ మెటీరియల్ సరఫరా చేస్తుంటాడు. నాలుగేండ్ల కిందట వారసిగూడలో నివాసముంటుండగా ఆ సమయంలో నల్లకుంటకు చెందిన మహమ్మద్ నజీమ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో నజీమ్ తన పిల్లలను పలు సందర్భాల్లో కొట్టడాన్ని చూసిన సంతోష్ అతడిని ఎందుకు కొడుతున్నావంటూ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధాలు ఏర్పడ్డాయి. ఇక అప్పటి నుంచి ఇద్దరూ ఎక్కడ కలిసినా అసభ్య పదజాలంతో దూషించుకుంటూ తిట్టుకునేవారు. కాగా శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బాధితుడు సంతోశ్‌కుమార్‌ను చూసిన మహ్మద్ నవాజ్ ఆటోలో వస్తూ కట్ కొట్టాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో మరోసారి అంబర్‌నగర్‌లోని ఏక్సీలా మెడికల్ హాల్ సమీపంలో ఇద్దరు తారసాపడ్డారు. దీంతో నవాజ్, తన స్నేహితులైన షేక్ సబీర్, షరీఫ్ఖాన్తో కలిసి సంతోశ్‌ను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనా విషయం తెలుసుకున్న చిలకలగూడ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితులు నవాజ్, షేక్ సబీర్, షరీఫ్ ఖాన్‌లను గంటల వ్యవధిలోనే గుర్తించి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు మహ్మద్ నవాజ్‌పై నల్లకుంట పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉంది. అలాగే ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ దొంగతనం కేసులో సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు. చిలకలగూడ ఠాణా పరిధిలోనూ మరో దొంగతనం కేసు ఉంది.