సంక్రాంతి బరి నుంచి ‘భీమ్లానాయక్’ తప్పుకొంది. జనవరి 12న విడుదలకావాల్సిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. ఫిబ్రవరిలో విడుదలకావాల్సిన ‘ఎఫ్-3’ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకురాబోతున్నది.
పెద్ద సినిమాల మధ్య పోటీని నివారించేందుకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆయా చిత్ర నిర్మాతలతో జరిపిన చర్చలు ఫలించాయి. నిర్మాతలందరి అంగీకారంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అగ్ర నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘తెలుగు చిత్రసీమలోని యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌కు సమస్యలు ఎదురైనప్పుడు వాటి పరిష్కారం కోసమే అందరం సమిష్టిగా గిల్డ్‌ను ఏర్పాటుచేశాం.
ఇప్పటివరకు మాకు ఎదురైన సమస్యల్లో తొంభైశాతం వరకు పరిష్కరించాం. కరోనా వల్ల గత రెండేళ్లుగా సినిమా నిర్మాణం, విడుదల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల పరంగా కొంత పోటీ నెలకొంది. పండుగకు ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘రాధేశ్యామ్’ చిత్రాలను విడుదలచేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మూడు పెద్ద సినిమాలకు సరిపడా స్క్రీన్స్ మన తెలుగు రాష్ర్టాల్లో లేవు. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాల షూటింగ్‌లు మొదలై మూడేళ్లు అవుతోంది. పాన్ ఇండియన్ స్థాయిలో ఈ చిత్రాలు విడుదలవుతున్నాయి.
వీటికి థియేటర్ల కొరత ఉండకూడదని ‘భీమ్లానాయక్’ నిర్మాతను కలిసి వాయిదా వేసుకోవాల్సిందిగా కోరాం. హీరో పవన్‌కల్యాణ్‌తో పాటు నిర్మాత రాధాకృష్ణ మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. వారి అంగీకారంతోనే ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తున్నాం. అదే రోజు విడుదలకావాల్సిన ‘ఎఫ్-3’ ని ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. హీరోల అభిమానులు ఆందోళన చెందకుండా మా సమస్యలను అర్థంచేసుకుంటారని భావిస్తున్నాం’అని తెలిపారు.
‘ఇండస్ట్రీ పరిస్థితిని, కష్టాలను పెద్ద మనసుతో అర్థంచేసుకొని ‘భీమ్లానాయక్’ను వాయిదావేయడానికి అంగీకరించిన హీరో పవన్‌కల్యాణ్, నిర్మాత రాధాకృష్ణలకు కృతజ్ఞతలు చెబుతున్నాం. ఇండస్ట్రీలో నిర్మాతలు కలిసికట్టుగా ఉండటం చాలా ముఖ్యం. సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లినప్పుడే అందరికి లాభదాయకంగా ఉంటుంది’ అని దామోదరప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీవీవీ దానయ్య, యూవీ వంశీ, రాజీవ్‌రెడ్డి, స్రవంతి రవికిశోర్ పాల్గొన్నారు.