ఈ మధ్య జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త విధానం ప్రకటించింది. దేశంలోని 7-14 ఏండ్ల బాలబాలికల కోసం ‘జవహర్ బాల మంచ్’ను స్థాపించింది. మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంకాగాంధీ, పవన్‌కుమార్ బన్సల్, కృష్ణ అల్లవరు ఈ సంస్థ పోషకులు అని వారి వెబ్ సైట్లోనే రాసుకున్నరు. బాలల ప్రేమికుడు, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తితో దేశంలోని బాలబాలికలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే సంకల్పం చెప్పుకున్నది ఆ సంస్థ.
రేవంత్‌రెడ్డి రక్షకుడు అయిన రాహుల్‌గాంధీకి సూటి ప్రశ్న. నిన్న ఉద్యోగుల సభలో నీచంగా మాట్లాడినట్టే, ఆ మధ్య స్కూలు పిల్లల మీటింగ్‌లోనూ రేవంత్‌రెడ్డి ఇదే భాష ఉపయోగించారు. దీనిని ‘జవహర్ బాల మంచ్’ ఆదర్శంగా తీసుకోగలదా? బాలలకు రేవంత్ మార్కు చదువు చెప్పగలదా? రేవంత్ మోడల్‌ను దేశవ్యాప్తం చేయగలదా? బాల మంచ్ ప్రస్తుత జాతీయ చైర్మన్ డాక్టర్ జీవీ హరిని తీసేసి ఆ స్థానాన్ని రేవంత్‌రెడ్డికి రాహుల్ ఇవ్వగలరా? లేదు కదా? మరి మా తెలంగాణకు ఎందుకు?
‘నేను సీఎం కావాలని అనుకున్న, అయిన. బస్’.. ఈ మాట రేవంత్‌రెడ్డి ఎన్నోసార్లు చెప్పారో. పదే పదే పబ్లిక్‌గా చెప్పడానికి ఆయన తెగ ఉత్సాహం చూపుతరు. సీఎం పదవి అంటే ఆయనకు జీవన సాఫల్య పురస్కారం లాంటిది మరి. ఆ పదవి కోసం ఆయన తెంపిన గట్లు, తిట్టిన తిట్లు, దిగజారిన మెట్లు లెక్కకు మించి!
సింహంలా కావాలనుకునే ముందు ఎలుకలు తినే అలవాటును పిల్లి మానేయాలని ఆఫ్రికన్ సామెత. ‘గమ్యం ఎంత ముఖ్యమో.. మార్గమూ అంతే ముఖ్యం’ అన్న మహాత్మాగాంధీ మాటలు రాహుల్‌గాంధీ ప్రియ శిష్యుడికి ఎక్కవు. రేవంత్‌రెడ్డికి చదివే, వినే, నేర్చుకునే అలవాటు లేదు. ఎంతోమంది మేధావులు షేర్పాల్లా తెలిసో తెలియకో సాయం చేయడం వల్లే రేవంత్ ఈ రోజు రాజకీయ ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కగలిగారు. ఇప్పుడు ఆయన కాళ్ల కింద మంచు కరగడం ప్రారంభమైంది. భర్తృహరి చెప్పిన ‘ఆకాశంబున నుండి… పాతాళం వరకూ’ పడిపోయే వివేక భ్రష్టత మూటగట్టుకుంటున్నరు. అప్రతిష్ఠ పోగుచేసుకొనేందుకు ఓవర్ టైమ్ పనిచేస్తున్నరు. తన సలహాదారులు, మంత్రులు, అధికారులు ఎవరినీ రేవంత్ నమ్మడం లేదు. ఈయనను వారూ నమ్మడం లేదు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును రాహుల్‌గాంధీ సందేహాస్పదంగా చూస్తున్నరు. మీనాక్షీ నటరాజన్ టీకాంగ్రెస్ వాకిలిలో ‘కొంచెం ఇష్టం, కొంచెం కష్టం’ లాగా.. ఒకోసారి అభిమానంగా, మరోసారి అనుమానాస్పదంగా త చ్చాడుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ పరిస్థితి దేశం ముందు హాస్యాస్పదంగా మారింది. రేవంత్ తనే స్వ యంగా బహిరంగ వేదికల మీద ఒప్పుకుంటున్నట్టు అలవిమాలిన అబద్ధపు హామీలు నేరవేర్చే పరిస్థితి లేదు. ‘నాతో అయితలేదు, మీరే పాలించండి’ అంటూ ఉద్యోగుల దగ్గర బేలగా, పీలగా మాట్లాడిన్రు. ‘ఎవరూ నా మాట వినడం లేదు’ అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్న రు. తన మంత్రివర్గ సహచరులు, కేంద్ర రక్షణశాఖ మం త్రి సైతం సీఎం పేరు మరిచిపోతున్నరు. వారు, వీరని తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి వర్గమూ నిరసనలతో హోరెత్తిస్తున్నది. ప్రస్తుత తెలంగాణ పరిస్థితిని 1985 లోనే డాక్టర్ సి.నారాయణరెడ్డి ఇలా ఊహించారు.
సుజల విమల కీర్తనలో సుఫలాశయవర్తనలో జలంలేక బలంలేక జనంఎండుతున్నది మలయజశీతల పదకోమల భావన బాగున్నా కంటికంటిలో తెలియని మంటరగులుతున్నది సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో పైరు నోచుకోని బీళ్లు నోళ్లు తెరుస్తున్నవి పుల్లకుసుమిత ద్రుమదళవల్లికామతల్లికలకూ చిదిమివేసినా వదలని చీడ అంటుకున్నది
దీనంతటికీ కారణం ఒకే ఒక్క రేవంత్‌రెడ్డి. పాలనను మూలకు పడేసి, ప్రజాధనం కుటుంబానికి దోచిపెట్టే నవీన మార్గాల అన్వేషణలో నిరంతరం మునిగి తేలుతూ, విమర్శకులపై దుష్ట భాషణలతో విరుచుకుపడుతూ చరిత్ర పుటల్లో శాశ్వత అపకీర్తి పేజీలు రాసుకుంటున్నరు తన కోసం. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి సాంత్వన కోసం వేదిక ఏదైనా విచక్షణ కూడా లేకుండా, సమాజం హర్షించదన్న స్పృహ లేకుండా విషంగక్కుతున్నరు. ఉద్యోగుల నియామక పత్రాల అందజేత సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధకుని మరణం కోరుకున్న జీవి రేవంత్‌రెడ్డి.
శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచీ అంతా ఆయన చావును కోరుకున్న వారే. ఆయన మీద జరిగినన్ని హత్యా ప్రయత్నాలు విశ్వంలో ఎక్కడా ఎప్పుడూ ఎవరి మీదా జరగలేదు. అన్నీ దాటి ఆయన జగద్గురువు అయినాడంటే కారణం సత్యసంధత, రుజువర్తన. ప్రపంచానికి ఆయన మాత్రమే ఇవ్వగలిగిన రాజకీయ, తాత్విక దార్శనికత. మంచిని మంచని, చెడును చెడు అనే సాహసం కేసీఆర్‌లో ఉన్నాయి. ఆయన నిండు నూరేళ్లూ మన మధ్య ఉంటరు. అది సామాజికావసరం.
రాహుల్‌గాంధీ పుట్టుక గురించి అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ నీచంగా మాట్లాడితే తీవ్రంగా నిరసించిన మహోన్నతుడు కేసీఆర్. సొంత పార్టీ ఎంపీ శశిథరూర్‌ను గాడిద అని రేవంత్ తూలనాడితే ఖండించిన విలువలున్న నాయకత్వం బీఆర్ఎస్ది. రాజకీయాల్లో విమర్శలోతుగా, సాధికారికంగాఉండాలి. అసహ్యంగా, అసభ్యంగా కాదు. అసెంబ్లీలో దూషణలకు పాల్పడొద్దని, ఆధారాలతో ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడాలని తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉద్బోధ చేసిన సంస్కారి కేసీఆర్. అలాంటి మహా నాయకుడిపై రేవంత్ వదరుబోతు తనాన్ని రాహుల్ సహించినా తెలంగాణ క్షమించదు. ఈ మొత్తం వ్యవహారంలో తరతమ భేదాలు లేకుండా తెలంగాణ సమాజమంతా రేవంత్‌ను ఏకిపారేస్తున్నది. జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు ఒకరు నాతో మాట్లాడి రేవంత్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఒకరు ఈయన నుంచి మాకు విముక్తి ఎపుడో అని సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు తెలంగాణ దీవెనలు పుష్కలంగా ఉన్నయి. ఆయనకు ఏమీ కాదు. ఫీనిక్స్‌లా ఎగిసివస్తరు. మీ పార్టీని మార్చురీ దారి నుంచి తప్పించండి. ఇప్పటికే రాజకీయ నాయకులు అంటేనే వెగటు భావనతో ఉన కొత్తతరం పూర్తిగా ఆశలు కోల్పోకముందే రేవంత్‌ను గద్దెదింపి పరువు కాపాడుకోవాలని రాహుల్‌గాంధీకి విజ్ఞప్తి. మీరు చెప్పుకున్న లక్ష్యాలను మీరైనా గౌరవించండి. అద్దం ముందు నిలబడి ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి! లేకపోతే చెడేది మీరే!