హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులను, ప్రజలను వేరు చేసే కుట్రలు చేయవద్దని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘కాల్చుకుతింటారా? కోసుకుతింటారా?’ అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఉద్యోగ జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్‌తో కలిసి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పీఆర్సీ ఇస్తామన్న హామీ 16 నెలలైనా అమలుకాలేదని మండిపడ్డారు. డీఏలు కూడా వెంటనే విడుదల చేస్తామన్నారు.. కానీ ఇంతవరకు దాని సంగతే పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగుల వెంటే ఉంటుందని స్పష్టంచేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వారి పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. ఉద్యోగులను ఎవరూ రెచ్చగొట్టడం లేదని స్పష్టంచేశారు. కేసీఆర్ హయాంలో ఉద్యోగుల సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేలా చూశామని చెప్పారు. అడగకుండానే 73% ఫిట్మెంట్, హెల్త్‌కార్డులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని పునరుద్ఘాటించారు. ఉద్యోగులకు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఇంతకాలం ఎదురు చూశామని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఇక సమయం మించి పోయిందని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందకపోవడంతో వారి గుండెలు ఆగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగులను అవమానిస్తుంటే, విధిలేని పరిస్థితిలోనే వారు కార్యాచరణ ప్రకటించారని తెలిపారు. ఇప్పటికైనా సీఎం జోక్యం చేసుకుని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు.
ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్, జీవిత బీమా వంటి వాటికి డబ్బుల్లేవు కానీ, అందాల పోటీల నిర్వహణకు రూ.250 కోట్లు ఎక్కడినుంచి వచ్చాయని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ప్రశ్నించారు. ఏ సంక్షేమ పథకాలను నిలిపివేసి, అందాల పోటీలు పెడుతున్నారని నిలదీశారు. ఉద్యోగులు బోనస్, జీతాల పెంపుదల వంటి గొంతెమ్మ కోర్కెలు అడగడం లేదని, పైసా పైసా కూడబెట్టి దాచుకున్న డబ్బులను ఇవ్వాలని మాత్రమే అడుగుతున్నారని చెప్పారు. తమది ఉద్యోగుల కుటుంబమని, పెన్షన్ తీసుకుంటున్నామని, ఉద్యోగులను తిడితే.. తమకు బాధ ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగులపై భౌతికదాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగులను, ప్రజలను వేరు చేయాలని ప్రభుత్వం చూస్తున్నదని దుయ్యబట్టారు. ఉద్యోగులు ఎవరికీ శత్రువులు కాదని చెప్పారు. వారు అడిగిన 54 డిమాండ్లలో 36 డిమాండ్స్ డబ్బులతో సంబంధం లేనివని తెలిపారు. సీఎం అడ్డదిడ్డమైన వ్యాఖ్యలతో ఉద్యోగులను అవమానించడం సరికాదని పేర్కొన్నారు.
ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన దుర్మార్గ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగ జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగులపైకి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నానికి సీఎం తెరలేపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకే సీఎం రేవంత్‌రెడ్డి వారి పట్ల అక్కసు వెళ్లగక్కుతూ.. శాడిజం చూపిస్తున్నారని దుయ్యబట్టారు. పెన్షనర్లు కోర్టులకు వెళ్లి, ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరిస్తేనే వారికి రావాల్సిన డబ్బులు ఇస్తారా? అని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగుల పట్ల ముక్కుసూటిగా మాట్లాడుతున్నారంటూ మం త్రి శ్రీధర్‌బాబు చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ముక్కుసూటిగా ఎందు కు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. హెలికాప్టర్ల కన్నా కార్ల ఖర్చే ఎక్కువ అని మంత్రి వ్యాఖ్యానించడం విడ్డూరమని మండిపడ్డారు. అంత చౌక అయితే అందరికీ హెలికాప్టర్లనే కొని ఇవ్వాలని చురకలేశారు. ఉద్యోగుల సమస్యలపై అడిగే హక్కు కేటీఆర్, హరీశ్‌రావుకు బరాబర్ ఉంటుందని స్పష్టంచేశారు. ఈ విషయంలో కేటీఆర్‌ను కాంగ్రెస్ నేతలు విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. కేసీఆర్‌ను మరిపిస్తామంటున్న రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే ఉద్యోగులకు 51% ఫిట్మెంట్ ఇవ్వాలని సవాల్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సుమిత్ర ఆనంద్, విష్ణువర్ధన్‌రావు, కల్యాణ్‌కుమార్, భుజంగరావు, హమీద్ పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ఉద్యోగుల రక్తం సల సల మరిగిపోతున్నదని, ఉద్యోగులను రాక్షసులుగా చిత్రీకరిస్తారా? అని మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. చర్చలు జరుపకుండా ఉద్యోగుల పట్ల సీఎంకు అంత ఉక్రోషం ఎందుకని ప్రశ్నించారు. కోపం ఉంటే.. ఉద్యోగులకే ఉండాలి కానీ సీఎంకు ఎందుకని నిలదీశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులకు, సంక్షేమ పథకాలకు లింకు పెట్టడం ఏమిటని మండిపడ్డారు. సీఎం కూడా ఒక ఉద్యోగే కదా? ఆయన మాత్రం జీతం ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.