హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 14: వరంగల్‌లోని ఎస్సార్ యూనివర్సిటీ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) నుంచి సూల్ ఆఫ్ అగ్రికల్చర్, బీఎస్సీ(హాన్స్) అగ్రికల్చర్ ప్రోగ్రామ్ రెండింటికీ గుర్తింపు లభించింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సూల్, కాలేజ్ ప్రోగ్రామ్ స్థాయిలో ఐసీఏఆర్ గుర్తింపు పొందిన తొలి ప్రైవేట్ యూనివర్సిటీగా ఎస్సార్ యూనివర్సిటీ నిలిచింది. ఈ గుర్తింపు 16 మార్చి 2026 నుంచి ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని ఎస్సార్ యూనివర్సిటీ ఛాన్స్లర్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ కాకాజీకాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రిడిటేషన్ బోర్డ్ (ఎన్ఏఈఏబీ) 42వ సమావేశంలో నిర్ణయం తీసుకోబడిందన్నారు. ఐసీఏఆర్‌కు చెందిన ఎన్ఏఈఏబీ సంస్థ దేశంలో వ్యవసాయ విద్య, పరిశోధనను పర్యవేక్షించే అగ్ర సంస్థ అన్నారు. ఐసీఏఆర్ గుర్తింపు కోసం విద్యాసంస్థలో విద్యాప్రమాణాలు, మౌలిక వసతులు, అధ్యాపక బలం, పరిపాలన, విద్యార్ధుల ఫలితాల్లో ఉన్నత ప్రమాణాలను సాధించిందన్నారు. ఈ ప్రక్రియలో నిపుణుల బృందం (పీఆర్ రివ్యూ టీం) ద్వారా కఠినమైన సమీక్ష జరుగుతుందన్నారు. వ్యవసాయ రంగంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలపై విశ్వవిద్యాలయం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమన్నారు.
దీని ద్వారా స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, సంబంధిత కోర్సుల ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. ఐసీఏఆర్ గుర్తింపు పొందిన డిగ్రీలు దేశీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతాయని, విద్యార్ధులు ఐసీఏఆర్ సాలర్షిప్స్, ఫెలోషిప్స్‌కు అర్హత పొందుతారని వరదారెడ్డి తెలిపారు. తద్వారా విశ్వవిద్యాలయానికి నిధులు, పరిశోధన అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ సమావేశంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్, ప్రొఫెసర్ జి.భూపాల్‌రాజ్, రిజిస్టార్ ప్రొఫెసర్ పీవీ రమణరావు, డీన్ ఆపరేషన్స్ అండ్ గ్రోత్ ప్రొఫెసర్ ఆర్చనా రెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీవీ రాజశేఖర్, ఐక్యూఏసీ ప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.