భద్రాచలం, మార్చి 17: జగదభిరాముని వసంతోత్సవం, డోలోత్సవానికి గురువారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అంకురార్పణ జరిగింది. సాయంత్రం 4 గంటలకు అర్చకులు పవిత్ర గోదావరి నుంచి మేళతాళాల నడుమ తీర్థపు బిందె తీసుకొచ్చారు. స్వామివారికి ఆరాధన, దర్బార్ సేవ నిర్వహించారు. భగవత్ ప్రార్థన చేశారు. యాగశాలలో విశ్వక్సేన పూజ, రక్షాబంధనం, పుట్ట మట్టితో పూజ, నవధాన్యాలతో అర్చన, అఖండ దీపారాధన, ద్వార తోరణ పూజ నిర్వహించారు.
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వసంతోత్సవం, డోలోత్సవాలు నిర్వహిస్తారు. అందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు పవిత్ర పుణ్య జలాలను గోటి తలంబ్రాలపై చల్లుతారు. రోలు, రోకలిలో లక్ష్మి, సరస్వతి అమ్మవార్లను ఆవాహన చేసి రోకలికి కంకణధారణ చేస్తారు. తొమ్మిది మంది ముత్తయిదువలు పసుపు కొమ్ములు దంచుతారు. స్వామివారిపై బుక్కా, గులాల్, అత్తరు, పన్నీరు చల్లుతారు. పసుపు, కుంకుమతోపాటు ఇతర ద్రవ్యాలు కలిపి 1,108 మంది మహిళలు తలంబ్రాలను కలుపుతారు. దీంతో రామయ్య పెండ్లి పనులు మొదలైనట్టు పరిగణిస్తారు. అనంతరం అర్చకులు వసంతుడిని ఆవాహన చేసి తొమ్మిది పసుపు ముద్దలను సిద్ధం చేస్తారు. మంత్రాలను జపిస్తూ వసంతాన్ని ప్రోక్షిస్తారు. పసుపు ముద్దల్లో ఒక ముద్దను రామయ్య శిరస్సుపై, రెండోది అమ్మవారి మంగళసూత్రం వద్ద, మూడో ముద్దను లక్ష్మణస్వామి వారిపై ఉంచుతారు. అప్పటి నుంచి సీతారాములు పెండ్లికొడుకు, పెండ్లి కుమార్తెగా భావిస్తారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి గోటి తలంబ్రాలు తెచ్చిన భక్తులు ఆలయ అధికారులకు అందజేస్తారు.