జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత, తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ సి.నారాయణ రెడ్డి స్మృతిలో ఏటా ప్రదానం చేస్తున్న ‘విశ్వంభర’ జాతీయ సాహిత్య పురస్కారానికి (2025) గాను ప్రముఖ అస్సామీ కవి నీలిం కుమార్ ఎంపికయ్యారు. ఈ నెల 29న హైదరబాద్‌లో జరిగే కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేయనున్నారు.
అస్సామీ సాహిత్యంలో ఒక ప్రత్యేక ముద్ర వేసిన కవి నీలిం కుమార్. సాధారణమైన మాటలతో అసాధారణమైన భావాలను అల్లగలిగే సత్తా ఆయనది. అలంకారాలు లేకుండా, లోతైన భావాలను ఆవిష్కరించే ఆయన కవిత్వం ఆసక్తికరమైన ప్రయాణం. విశ్వంభర అవార్డు సందర్భంగా నీలిం కుమార్‌తో వారాల ఆనంద్ ఇంటర్వ్యూ ‘నమస్తే తెలంగాణ’ పాఠకుల కోసం ప్రత్యేకం…
అవార్డు అంటే ఏమిటి? అవార్డును ఎట్లా పరిగణిస్తారు? ఇప్పటికే మీరు మీ కవిత్వానికి అనేక అవార్డులు పొందారు కదా.
నా దృష్టిలో బహుమతి అంటే నా శ్రమకు గుర్తింపుగా, నా సాహిత్య రచనలకు మద్దతుగా నిలిచే ఒక గుర్తింపు. అయితే బహుమతులు మాత్రమే సాహిత్యకృతులను కొలిచే సాధనాలు కావు, తీర్పు చెప్పే ప్రమాణాలు కాకూడదు. ఒక రచయిత తన కళ పట్ల చూపే నిబద్ధతకు బహుమతులు గుర్తింపుగా నిలుస్తాయని నేను నమ్ముతున్నాను. అంతేకాదు, రచయితలలో ప్రేరణ నింపుతూ, మరింత విశిష్టమైన రచనలు చేయడానికి ఉత్తేజాన్ని కలిగిస్తాయి.
ఈశాన్య భారత రాష్ర్టాల్లో సాహిత్యం, ముఖ్యంగా కవిత్వ స్థితిగతులు ఎలా ఉన్నాయి?
ఈశాన్య భారతదేశం వైవిధ్యానికి పెట్టింది పేరు. ఆ ప్రాంతం వైవిధ్యానికి, విభిన్నతకు నిలయంగా ఉంది. అక్కడ ప్రతి రాష్ట్రం తనదైన ప్రత్యేక గుర్తింపును కలిగి ఉండటం ఆ మొత్తం ప్రాంతానికి ప్రత్యేకతను తీసుకువస్తుంది. భిన్నమైన భాషలు, మాండలికాలు, రంగురంగుల దుస్తులు, ఆచారాలు, పండుగల వంటి ప్రతి అంశమూ ఆ ప్రాంతంలో సమృద్ధిగా ఉన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. భారతదేశంలోని ప్రధాన రాష్ర్టాల నుంచి ఆ ప్రాంతానికి ఉన్న భౌగోళిక దూరం కూడా అక్కడి సాహిత్య స్వరాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. అక్కడి కవిత్వంలోని విషయాలు, వస్తువులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రజల పోరాటాలు, విజయాలు, ప్రకృతి సౌందర్యం, ఆచార సంప్రదాయాల సౌరభం ఇవన్నీ అక్కడి కవిత్వానికి ప్రాణం పోస్తాయి.
ఈ తరం యువతలో చదువడంపై ఆసక్తి తగ్గిపోతుందన్నది ఇవ్వాల్టి పెద్ద ఫిర్యాదు. వారు ఎక్కువగా దృశ్య మాధ్యమాల వైపు, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వం టివి చూసే దిశగా ఆకర్షితులవుతున్నారని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
నేటితరం చదువడం తగ్గిందని, వారు తమ దృష్టిని దృశ్య వీధులపై వీడియోలు, ముఖ్యంగా Instagram reels వంటివాటిపై మరల్చుకుంటున్నారని చాలామందిలో ఒక పెద్ద హృదయ వేదన ఉన్నది. ఇది పూర్తిగా నిరాధారమనటానికి లేదు. ఆధునిక సాంకేతికత, సామాజిక మాధ్యమాల విప్లవం మన జీవనశైలిని మారుస్తున్న సంగతిని అంగీకరించక తప్పదు. వీడియోలు వేగంగా వినోదాన్ని అందిస్తాయి. వేగం, సరదా, తక్షణ స్పందనలు ఇవన్నీ కొత్త తరం ఆ ప్రపంచంలో మునిగిపోయేలా చేస్తున్నాయి. కానీ, ఇది మొత్తంగా చదువడం నిలిచిపోయిందనే తుది తీర్పునకు రావడం సరైంది కాదు. పఠనపు అలవాట్లు మారుతున్నాయి, అంతే తప్ప అంతగా నశించిపోవడం లేదు. ఇప్పటి తరం చిన్నగా అయినా, నిశితంగా చదువాలని చూస్తున్నది. వారు పెద్ద నవలలు కాకుండా, కవిత్వం, సూక్తులు, బ్లాగులు, సోషల్ మీడియా ఆధారిత వ్యాసాలు చదువటం ఎక్కువగా చేస్తున్నా రు. డిజిటల్ ఫార్మాట్లో కూడా మంచి అంశాలు చదివేవారున్నారు. చదువడం ఒక పనిగా కాకుండా, దాన్నొక అన్వేషణగా పరిచయం చేయడం. పుస్తకం పుటల్లో జీవించే లోకాలను చూపించగలిగితే, కొత్త తరానికి చదువడం ఒక ఆటలాంటిదైపోతుంది. అంతేకాక, పుస్తక పఠనాన్ని visualsతో పోటీ చేయించే ప్రయత్నం చేయకుండా, రెండింటినీ సమతుల్యతతో సమన్వయం చేయడం అవసరం.
కృత్రిమ మేధస్సు పుంజుకుంటున్న ప్రస్తుత తరుణంలో అనువాదం ప్రాముఖ్యం, భవిష్యత్తు ఏమిటి?
నిజమైన అనువాదానికి మానవ హృదయమే అవసరం. నేను గట్టిగా నమ్మేది ఏమంటే ఏఐ అనువాదం యాంత్రికమైన ప్రక్రియ మాత్రమే. అది పదాలను మార్చగలదు, గణితంగా సరిపోయే వాక్య నిర్మాణాలు ఇవ్వగలదు. కానీ, అది జీవాన్ని, జీవితాన్నివ్వలేదు. సాహిత్యం అనేది గణిత పద్ధతుల్లో కొలవలేని ఒక సజీవ ప్రక్రియ. దానిలో భావాల ప్రవాహం ఉంటుంది, సంస్కృతుల నిగూఢత ఉంటుంది, హృదయాల స్పందన ఉంటుంది. అవి యంత్రానికి చిక్కవు. ఏఐకి పదాల పరస్పర మార్పు సులభమే కానీ, ప్రజల మనసులు పలికే భాష, వారి వేదనల వెనుకనున్న మౌనం, హాస్యపు అంతర్లీన అన్వయం, కవిత్వపు కలల గుణగణాలు ఇవన్నీ మానవ అనుభూతితోనే పుట్టేవి. ఏఐ ఒక సాధనం మాత్రమే, మార్గం కాదు. సాహిత్యానువాదానికి అసలైన మూలం మనసు. భావానికి అర్థం చూపగలిగే కలాన్ని పట్టుకున్న చేతి చలనం.
సాహిత్య రంగంలోకి అడుగుపెట్టాలనుకునే యువ ప్రతిభావంతుల కోసం మీ సూచనలు ఏమిటి?
సాహిత్యాన్ని అభ్యసించాలనుకునే యువతకి కలమూ, రచనే కాదు… దాని ద్వారా సమాజపు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే గొప్ప బాధ్యత కూడా ఉన్నది. రచన అనేది ఒక నిబద్ధత. అది లోతైన అధ్యయనం, సామాజిక సూత్రపాలన, ధైర్యమైన అభిప్రాయాన్ని కోరుతుంది. సాహిత్యంలో ప్రావీణ్యం వహించాలనుకునే వాళ్లు అధ్యయనం, పరిశీలన, అనుభవం ద్వారా పరిణతి పొందాలి. జీవనంలోని అన్ని అంశాల్లోనూ చైతన్యాన్ని కలిగిస్తూ, సమాజాన్ని ముందుకు నడిపించే మార్గదర్శకులుగా ఎదగాలి. ఎందుకంటే వారు ఎప్పటికైనా భవిష్యత్తు నిర్ణయాలకు బాధ్యత వహించాల్సిన వారే. దేశ నిర్మాణంలో తమ పాత్రను నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది.
కొత్త తరం వ్యక్తిత్వ నిర్మాణంలో సాహిత్య పాత్ర ఏమిటి?
సాహిత్యం మన ముందు విస్తారమైన ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది. అది మనలను సంకుచిత ఆలోచనలు, కట్టుబాట్లు కుళ్లిన అననుకూలమైన మనస్తత్వా ల నుంచి విముక్తం చేస్తుంది. సాహిత్యం భిన్నత్వాల నడుమ వంతెనగా నిలుస్తుంది. అది మనలను సంఘటనల మధ్య ఉన్న గోడలను అధిగమించి, ప్రపంచ పౌరులుగా మలచుకొనే శక్తిని కలిగిస్తుంది. ద్వేషం, సామాజిక విభేదాలు, అసమానత, అసహనం వంటి పరిమిత దృక్పథాల నుంచి బయటపడేందుకు సాహిత్యం ఒక శక్తివంతమైన సాధనం. ఇది మనలో అవగాహన పెంపొందించి, భిన్నత్వాన్ని అర్థం చేసుకునే దిశగా నడిపిస్తుంది. మతం, భాష, ప్రాంతం అనే అడ్డంకులను చెరిపేసి మానవత్వాన్ని, విశాలదృష్టిని ఆవిష్కరించే మార్గం సాహిత్యం. సాహిత్యానికి అడ్డుకట్టలుండవు. దాని పయనం విస్తృతమైనది, లోతైనది.
కళలను, సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వ పాత్రను మీరెట్లా విశ్లేషిస్తారు?
కళ, సాహిత్యం, సంస్కృతిని అభివృద్ధి పరచడానికి, పరిరక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తుంది. ఈ ఆర్థిక మద్దతు సమాజంలో వాటి ప్రాధాన్యాన్ని నిలుపుకొంటూ, వాటి విలువను పెంచే పనిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సహాయంతో కళాకారులు, రచయితలు, సాంస్కృతిక సంస్థలు తమ ప్రతిభను వికసించుకునే అవకాశాన్ని పొందుతారు. కళలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రభుత్వం సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలు, వైవిధ్యం వంటి మౌలిక విలువలను ప్రోత్సహిస్తుంది. దీని ఫలితంగా మన దేశపు సాంస్కృతిక దృశ్యాన్ని విశ్వవ్యాప్తంగా ప్రతిష్ఠించగలుగుతాం.
దేశంలోని ఇతర భాషల కవిత్వంతో పోల్చితే అస్సాం కవిత్వం ఎలా ఉంటుంది?
అస్సామీయ కవిత్వం అక్కడి సాంస్కృతిక ఛాయల ప్రతిఫలనం. వారసత్వం, సంప్రదాయాలు, జీవనశైలి-all elements అందులో మిళితమై, కవిత్వాన్ని ఓ విలక్షణమైన రుచితో నింపేస్తాయి. అస్సాంలోని ఆహారం రుచులు, వస్త్రధారణ, జీవన విధానాల సుగంధం అక్కడి కవిత్వంలో ప్రతి పదంలోనూ ప్రతిధ్వనిస్తుంది. అయితే, నా నమ్మకం ఏమంటే మన దేశంలోని ప్రతి భాష, ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రాంతీయత (Regionalism) ఉంది. అదే వారి కవిత్వంలో ప్రత్యేకంగా మెరుస్తూ, స్థానికతను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నదులు, ప్రకృతి అందాలు, ధైర్యంగా పోరాడే ప్రజల జీవనగాథలు ఈ కవిత్వాన్ని జీవిత వాస్తవాలకు దగ్గరగా తీసుకువెళ్తాయి.
మీ అద్భుతమైన కవితలకు ప్రేరణ ఏమిటి? వాటిలో కొన్ని నేను చదివాను, తెలుగులోకి అనువదించి సాహిత్య పేజీల్లో ప్రచురించాను కూడా… జీవితానుభవాలే నా కవిత్వానికి మెరుపు, మూలం. జీవితంలోని విభిన్న అనుభవాలు, విభిన్న మనుషులను కలవడం, అనేక చోట్లను అన్వేషించడం, ప్రేమ, ఒంటరితనం లాంటి భావోద్వేగాల మధ్య ప్రయాణించడం ఇవన్నీ నాకు కవిత్వం పట్ల లోతైన ఆసక్తిని కలిగించాయి. ప్రత్యేకంగా నాకు అస్సామీ భాష అంటే ఎంతో మక్కువ. దానిలోని ప్రత్యేకమైన లయ, ఛందస్సు, సౌందర్యపూరితమైన స్వరాల రూపకల్పన ఇవన్నీ నాకు ప్రేరణనిస్తూ, నా భావాలను కవిత్వంగా మలచుకోవడానికి తోడ్పడుతాయి.