Collector Koya Sri Harsha | పెద్దపల్లి, మే22: మహిళల ఆర్థిక స్వావలంభనకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. కలెక్టరేట్లో స్వశక్తి మహిళా సంఘాల సంబంధిత అధికారులతో కలెక్టర్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు అమలు చేసే వివిధ పథకాలపై మహిళ సంఘాల సభ్యులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం కింద ఏడాదికి దాదాపు రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ వివిధ వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు. మహిళా సంఘాల సభ్యులకు పథకాల వివరాలతో కూడిన బుక్ లెట్ అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలతో పాటు రాజీవ్ యువ వికాసం, ఎస్సీ సబ్ ప్లాన్, కేంద్ర ప్రభుత్వం అందించే పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ వంటి వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్‌రావు, డీఆర్డీవో ఎం కాళిందిని, డీఏవో ఆదిరెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్, డీఎంహెచ్‌వో అన్న ప్రసన్న కుమారి, బీసీ వెల్ఫేర్ అధికారి రంగారెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ వినోద్ కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.