శ్రీశైలం : జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో గురువారం షష్ఠి తిథి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, విశేషార్చనలు చేశారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ పూజ కార్యక్రమాలు చేపట్టారు. అలాగే త్రిఫల వృక్షం కింద కొలువైన దత్తాత్రేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చిన భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంది. అయితే, దేవస్థానానికి వచ్చే భక్తులు తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఈఓ కేఎస్ రామారావు కోరారు.
దేవస్థానం ఉత్పత్తులు నాణ్యమైనవి : ఈఓ
దేవస్థానం ఆధ్వర్యంలో తయారవుతున్న వివిధ రకాల ఉత్పత్తులు నాణ్యమైనవని ఆలయ ఏఓ కేఎస్ రామారావు పేర్కొన్నారు. గురువారం మల్లికార్జున సదన్ ప్రాగణంలోని దుకాణ సముదాయంలో ఏర్పాటు చేసిన వస్తువుల విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్ర వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రచురణలతోపాటు గో ఉత్పత్తులైన దివ్యపరిమళ విభూధి,
గోఆర్క్, ధూప్ స్టిక్స్, ప్రమిదలు, పళ్లపొడి అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
అదే విధంగా స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు సైతం భక్తులందరికీ అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆస్థాన మాసపత్రిక శ్రీశైలప్రభ వార్షిక చందాదారులు చేర్చేందుకు సైతం ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఈఈ మురళీ బాలకృష్ణ, ఏఈఓ నటరాజ్, హరిదాసు, డీఈ నర్సింహారెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకులు అనీల్ కుమార్, పర్యవేక్షకులు శ్రీహరి, ఏఈ సుబ్బారెడ్డి, గిరిజారమణి పాల్గొన్నారు.