Union Budget | గేమింగ్, కామిక్ రంగంలో యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఏర్పాటు చేయబోతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 15వేల సెకండరీ పాఠశాలల్లో కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. 500 కాలేజీల్లో కూడా కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి జిల్లాలో బాలికల కోసం ప్రత్యేక వసతిగృహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బాలికల వసతి గృహాల కోసం సర్దుబాటు నిధి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ప్రధాన పర్యాటక కేంద్రాల్లో 10 వేల మంది గైడ్లకు నైపుణ్య శిక్షణ ఇవ్వబోతున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఖగోళ శాస్త్ర పరిశోధనల అభివృద్ధి, ఆసక్తి పెంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నేషనల్ సోలార్జ్ సోలార్ టెలిస్కోప్, నేషనల్ లార్జ్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, కాస్మోస్ 2 ప్లానిటోరియం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.