ఆదిలాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) ః ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)- 2026 ముసాయిదా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో సర్కు ముందు 23,39,191 మంది ఓటర్లు ఉండగా.. ముసాయిదా జాబితా ప్రకారం ఓటర్లు సంఖ్య 20,18,249కు చేరింది. ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,20,942 మంది ఓటర్లు తగ్గారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా జాబితా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియోజకవర్గాల కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.
బీఎల్వోల వద్ద ఉన్న జాబితాలో ప్రజలు తమ వివరాలు చూసుకోవడానికి అవకాశం ఉందన్నారు. సోమవారం నుంచి వచ్చే నెల 16 వరకు ముసాయిదా అభ్యంతరాలపై నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారం విచారించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ఓటర్లు తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. అభ్యంతరాలను పూర్తిస్థాయిలో పరిష్కరించి అక్టోబరు 19న ప్రత్యేక సమగ్ర సవరణ-2026 తుది ఓటరు జాబితాను ప్రదర్శించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

