బ్యాటింగ్‌లో దంచికొట్టే వార్నర్ లేడు!
బౌలింగ్‌లో తిప్పేసే రషీద్ ఖాన్ లేడు!
ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ జాడే లేదు!
అయినా.. అనామక ఆటగాళ్లతోనే అద్భుతాలు చేయడం అలవాటైన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతున్నది!!
కేన్ మామ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లపై నమ్మకముంచిన ఫ్రాంచైజీ.. గతేడాది
పేలవ ప్రదర్శననను మరిపిస్తూ విజృంభించాలని చూస్తున్నది!!
భువనేశ్వర్, నటరాజన్ స్వింగ్‌కు.. ఉమ్రాన్ మాలిక్ వేగం జోడిస్తే! విలియమ్సన్ నిలకడకు..
పూరన్, మార్క్మ్ మెరుపులు జతకలిస్తే!
అభిషేక్, సమద్ వంటి యంగ్ గన్స్కు.. సుందర్, త్రిపాఠి తోడైతేసన్రైజర్స్ను ఆపడం కష్టమే !!
గతేడాది మినహా వరుసగా నాలుగు సీజన్ల పాటు ప్లే ఆఫ్స్‌కు చేరుతూ వచ్చిన హైదరాబాద్..
ఈ సారి కూడా నివురుగప్పిన నిప్పులా చెలరేగి టైటిల్ పట్టాలని ఆశిద్దాం!!
ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం నుంచి.. వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేసుకునేంత వరకు అంచనాలకు అందకుండా సాగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. శనివారం నుంచి ప్రారంభం కానున్న పదిహేనో సీజన్ కోసం అనుభవం, యువరక్తం మేళవించిన జట్టుతో ముందుకు రానుంది. మైదానం లోపలా బయటా.. అభిమానులను ఉర్రూతలూగించిన డేవిడ్ వార్నర్ లాంటి విధ్వంసక ఓపెనర్‌ను వేలానికి వదిలేసిన ఫ్రాంచైజీ.. జట్టుకు తురుపుముక్క లాంటి రషీద్ ఖాన్‌ను కూడా తిరిగి తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. అంతర్జాతీయ అనుభవం లేని అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌ను అట్టిపెట్టుకున్న రైజర్స్.. విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను రూ. 10.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. రైజర్స్ కొనుగోలు చేసుకున్న తర్వాత పూరన్ ఫామ్‌లోకి రావడం సంతోషించదగ్గ విషయం కాగా.. వాషింగ్టన్ సుందర్ (రూ. 8.75 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ. 8.5 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.6.5 కోట్లు) కోసం కూడా హైదరాబాద్ భారీగా ఖర్చు చేసింది. గత సీజన్లో 14 మ్యాచ్‌లాడి మూడింట మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్.. ఈసారి సరికొత్త మేళవింపుతో సత్తాచాటేందుకు సిద్ధమైంది. మరింకెందుకూ ఆలస్యం మీరు కూడా మన జట్టుకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పేయండి.