వికారాబాద్, జూన్ 20 : పాఠశాలల బస్సులు, వ్యాన్లపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుందని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. విద్యార్థుల రవాణాకు ఉపయోగించే బస్సులు, ఇతర వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన జిల్లా పోలీసు అధికారులకు టెలీ కాన్ఫరెన్స్లో ఆదేశించారు. పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలకు గుర్తింపు పొందిన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తులనే డ్రైవర్లుగా నియమించాలన్నారు.
అదేవిధంగా డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని హెచ్చరించారు. వాహనాల సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించొద్దని.. పాఠశాలల వాహనాలు నిర్ణీత వేగ పరిమితిని మించరాదన్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
పాఠశాలల యాజమాన్యాలు తమ వాహనాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పైన పేర్కొన్న చర్యలన్నీ విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి దోహదపడతాయని, ప్రజలు, తల్లిదండ్రులు కూడా విద్యార్థుల రవాణాపై నిఘా పెట్టాలన్నారు. ఏమైనా నిబంధనల ఉల్లంఘనలు గమనిస్తే వెంటనే సమీపంలోని ఠాణాలో లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.