తుంగతుర్తి, మార్చి 12 : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బి ఫామ్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారికి క్లీన్ చీట్ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అనంతరం లోక్ సభ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి చరిత్ర హీనమైన తీర్పులు ఇవ్వడం సరికాదని ఆయన మండిపడ్డారు. స్పీకర్ తీర్పు పై మరోసారి ఉన్నత న్యాయ స్థానాల్లో తమ పార్టీ నాయకత్వం సవాల్ చేస్తుందని తెలిపారు.