హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ‘డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని నేను గతంలోనే సూచించా. నా ఆదేశాలు పాటించి ఆనాడే సమీక్ష నిర్వహిస్తే మళ్లీ సభలో ఇదే అంశంపై చర్చించాల్సి వచ్చేది కాదు’ అని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అసంతృప్తి వ్యక్తంచేశారు. అసెంబ్లీ వేదికగా రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని స్పీకర్ తప్పుబట్టారు. ఇందిరమ్మ ఇండ్లపై ఎమ్మెల్యేల్లో అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాలని చెప్పారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు, ఆ శాఖ అధికారులతో ఇప్పటికైనా సమీక్ష నిర్వహించాలని సూ చించారు. అవసరమైతే ఇదే అంశంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టాలని పేర్కొన్నా రు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ స్వల్పకాలిక చర్చపెట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా శాసనసభ ప్రశ్నోత్తరాల్లో డబుల్ బెడ్రూమ్లు, ఇందిరమ్మ ఇండ్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. బీఆర్ఎస్ సభ్యుల సవాళ్లు, ప్రశ్నలతో సభ అట్టుడికింది. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద్, దానం నాగేందర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పవార్, పాల్వాయి హరీశ్‌బాబు, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, ఆదినారాయణ, సీహె చ్ విజయరామారావు, కేఆర్ నాగరాజు, పాయల్ శంకర్, చిక్కుడు వంశీకృష్ణ, కౌసర్ మెయినుద్దీన్, ఎంఎస్ రాజ్‌ఠాకూర్, రాందాస్‌నాయక్, మందుల సామేలు, యశస్విని చర్చలో పాల్గొని పలు సమస్యలు లేవనెత్తారు. కొందరు అధికార పార్టీ సభ్యులు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు దీటుగా బదులిస్తూ ఎదురుదాడికి దిగారు. దీంతో సభలో సుదీర్ఘ చర్చకు దారితీసింది.
‘రండి.. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో కేసీఆర్ ఎంతో గొప్పగా కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూపిస్తం’ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర సభ్యులను కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంపై కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన విమర్శలపై తలసాని ఘాటుగా స్పందించారు. తనతో వస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంత గొప్ప గా నిర్మించామో చూపిస్తామని అధికార పక్షానికి సవాల్ విసిరారు. గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను తీసుకెళ్లి ఇండ్లను చూపించానని చెప్పారు. గత 28 నెలల్లో హైదరాబాద్‌లో ఒక్క ఇంటినైనా నిర్మించారా? అంటూ సర్కార్‌ను నిలదీశారు. 2బీహెచ్‌కే ఇండ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఐడీహెచ్ కాలనీలోనే తొలుత డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తాము 2.31 లక్షల ఇండ్లు మంజూరు చేసి, 1.62 లక్షల ఇండ్లు నిర్మించామని, జంటనగరాల పరిధిలో 65 వేల ఇండ్లను లాటరీ విధానంలో పారదర్శకంగా లబ్ధిదారులకు కేటాయించామని వివరించారు. గ్రేటర్ పరిధిలోని ఇండ్లను 70 ఏండ్లు గా నివాసం ఉంటున్న వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు. నాటి గవర్నర్ నరసింహన్ తాము నిర్మించిన ఇండ్లను చూసి అభినందించారని గుర్తుచేశారు.
ఇందిరమ్మ కమిటీ ఎవరికి చెప్తే వారికే గ్రేట ర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తే పారదర్శకత ఎలా అవుతుంది? ఇదేం పద్ధతి? అని మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీశారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలున్నాయని అధికారులు చెప్తున్నారని చెప్పారు. ఈ విధానం పారదర్శకతకు తూట్లు పొడవడమే అవుతుందని మండిపడ్డారు. లాటరీ ద్వారానే అర్హులైన లబ్ధిదారులకు డబుల్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో లక్ష ఇండ్లు కట్టామని, అసెంబ్లీ ఎన్నికల ముందు నిర్మాణం పూర్తయిన వాటిని లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేల సమక్షంలో లక్కీడ్రా తీసి ఇండ్లు కేటాయించామని తెలిపారు. గ్రేటర్ పరిధిలో లక్కీడిప్ విధానంలో ఇండ్లు కేటాయించేలా సభలో ప్రకటన చేయాలని కోరారు.
ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్లో నిధులే కేటాయించలేదని, ఇండ్లు ఎలా నిర్మిస్తారని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. మొదటి దశలో మంజూరు చేసిన ఇండ్లకు రూ.12,500 కోట్లు అవసరం అవుతుందని, ఇప్పటివరకు రూ.5వేల కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించారని, తాజా బడ్జెట్లో రూ.5 వేల కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. మొదటి దశలో నిర్మించే ఇండ్లకే రూ.3 వేల కోట్లు తక్కువ పడుతున్నాయని, వచ్చే ఏడాది నియోజకవర్గానికి 3.500 ఇండ్లకు నిధులెలా ఇస్తారని ప్రశ్నించా రు. మొదటి విడుతలోనూ 3.24,536 ఇండ్లు మంజూరు చేస్తే, 2,62,449 ఇండ్లు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపత్రం ఇచ్చాక పలువురికి ఎల్1 క్యాటగిరీలో లేరని బిల్లులు ఆపేశారని, సగం కట్టిన తర్వాత కార్లు, ట్రాక్టర్లున్నాయని ఇంకొందరికి బిల్లులు నిలిపివేశారని ఆరోపించారు.
గ్రేటర్లో 92 వేల ‘డబుల్’ ఇండ్లు
‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు లక్షల ఇండ్లు మంజూరు చేసింది. సుమారు 92 వేలకు పైగా ఇండ్లు నిర్మించింది’ అని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. బుధవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. పూర్తిచేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ‘బీఆర్ఎస్ పాలనలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన వాటిలో 70,861 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయ్యాయని, 21,838 కొంతమేర అసంపూర్తిగా ఉన్నాయని, చిన్న మరమ్మతులు చేయా ల్సి ఉన్నదని వెల్లడించారు. వీటి పనులను పూర్తిచేసి 99 రోజుల ప్రణాళికలో భాగంగా త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో లబ్ధిదారులు నివాసం ఉండకపోతే వాటిని ఇతరులకు కేటాయిస్తామని తేల్చిచెప్పారు. దాదాపు 12 వేల ఇండ్లు ఖాళీగా ఉన్నాయని, ఆయా లబ్ధిదారులకు నోటీసులిచ్చామని పేర్కొన్నారు. రెండు నెలల్లో ఆయా ఇండ్లలో నివాసం ఉండకపోతే, కేటాయింపులను రద్దుచేసి, ఆయా కాలనీలకు సమీపంలో ఉండే అర్హులకు కేటాయిస్తామని వెల్లడించారు. ఆయా కాలనీల్లోని కమర్షియల్ షాపులను బహిరంగవేలం ద్వారా విక్రయించి, ఆయా డబ్బును విద్యుత్తు చార్జీ లు, లిఫ్ట్ వంటి అవసరాలు తీర్చేందుకు ఖర్చు చేస్తామని తెలిపారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టలేదని కొంతకాలంగా మంత్రులు, అధికారపక్ష ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న ఆరోపణలు డొల్లేనని మంత్రి సమాధానంతో బట్టబయలైంది.
గోనె సంచుల్లేవని ధాన్యం కొనబోమంటే ఎట్లా? అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలపై ఆయన ప్రస్తావించారు. గ్రామాల్లో గోనె సంచుల్లేవని, లారీలు రావడంలేదని అధికారులు ధాన్యం కొనుగోలు చేయబోమంటున్నారని తెలిపారు. ధాన్యానికి సరిపడా గోనె సంచులను అందుబాటులో ఉంచాలని కోరారు. స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ల సంఖ్య పెంచాలని విజ్ఞప్తిచేశారు.