బూర్గంపహాడ్, మార్చి 25 : 13వ వేతన ఒప్పందం పెండింగ్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పందం ఆర్యూ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.22 వేల వేతనం తగ్గకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో సారపాక ఐటీసీ పీఎస్పీడీ అడ్మిన్ బ్లాక్ ఎదుట డీఆర్టీవో మిత్రపక్షాలతో కలిసి బుధవారం భారీ ధర్నా నిర్వహించారు.
తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత వేతన ఒప్పందంలో పేర్కొన్న విధంగా నూతన క్వార్టర్స్, షటిల్ కోర్టు నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా వంద శాతం మెడికల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం కల్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్టీయూ మిత్రపక్షాలైన సీఐటీయూ, బీఎంఎస్, ఏఐటీయూసీ, టీఈయూ సంఘాల నాయకులతోపాటు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.
కాగా, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సారపాకలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరాయి. శ్రీరామనవమికి సీఎం వస్తున్న నేపథ్యంలో దీక్షా శిబిరాన్ని తొలగించాలని పోలీసు అధికారులు ఆదేశించడం సరికాదన్నారు.
ఐటీసీ యాజమాన్యం సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని కార్మిక నాయకులు స్పష్టం చేశారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు మారం వెంకటేశ్వరరెడ్డి దీక్షలకు మద్దతు పలికారు. కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, షేక్ యాకూబ్‌పాషా, జేఏసీ మెంబర్లు పూనెం సురేంద్ర, సూరిశెట్టి జగదీశ్, రామశెట్టి లక్ష్మి, మేకల శేషమ్మ, డేగల రవి, కందాల వెంకటరెడ్డి, పిల్లి ప్రభాకర్‌రావు, ఆకిలి చంద్రారావు, చుక్కపల్లి బాలాజీ పాల్గొన్నారు.